Daggubati Venkateshwar Rao comments YSRCP: ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోవడం మంచిది అయిందని వైఎస్ఆర్ సీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన తన సతీమణి పురందేశ్వరితో కలిసి కారంచేడు గ్రామంలో పర్యటించారు. ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా దంపతులు ఇద్దరూ గ్రామస్థులతో మాటామంతీ నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కారంచేడులో రోడ్లు వేయలేదని గ్రామస్థులు చెబుతున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రస్తుత పరిస్తితుల్లో ఈ రోడ్ల మీద ఇంత స్వేచ్ఛగా తిరగగలిగే వాడిని కాదని అన్నారు. మీ ముందు తల ఎత్తుకొని తిరగగలిగే వాణ్ని కాదని అన్నారు. భగవంతుడి దయవల్ల పర్చూరు నియోజకవర్గంలో తాను ఓడిపోవడం మంచిదైందని అన్నారు.


ఓడిపోయిన రెండు నెలలకి జగన్ పిలిచి నా కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. కానీ, జగన్ పెట్టే నిబంధనలకు తాను వైసీపీలో ఇమడలేనని నిర్ణయించుకున్నానని అన్నారు. నేడు రాజకీయాలంటే బూతులు తిట్టుకోవటం.. దానికి ఎదురు జవాబులు ఇచ్చుకోవడం తప్ప ఒరిగిందేమీ ఉండడం లేదని దగ్గుబాటి అభిప్రాయపడ్డారు. పురందేశ్వరి గురించి మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పురందేశ్వరిని తానే.. బీజేపీలో చేరమని సలహా ఇచ్చినట్లు చెప్పారు. బీజేపీ అధికారంలో లేని సమయంలోనే పురందేశ్వరి ఆ పార్టీలో చేరారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు.