Daggubati Venkateshwar Rao Comments: వైసీపీ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ రానివాళ్లు అందరూ అదృష్ణవంతులే అని అన్నారు. బాపట్లజిల్లా కారంచేడు మండలం కుంకలమర్రులో రుద్రభూమి మహాప్రస్థానం ప్రారంభోత్సవంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. ఆయనతోపాటు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా ఉన్నారు.
ప్రస్తుత రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవడానికి రూ.కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. గతంలో గెలిచినా సంపాదించుకొనే ప్రయత్నం చేసేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజలకు సేవ చేసే అవకాశం లేకుండాపోయిందని దగ్గుబాటి అభిప్రాయపడ్డారు. పార్టీకి అధిపతిగా ఉన్నవాళ్లు.. ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా రాబడిని సెంట్రలైజ్ చేసుకున్నారని అన్నారు. మద్యం, ఇసుక రవాణా ద్వారా ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో పార్టీల అధిపతులే పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు ప్రజా సేవ చేసే అవకాశమే లేకుండా పోయిందని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో టికెట్లు రానివారు చాలా అదృష్టవంతులని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. వారికి రూ.30 నుంచి రూ.40 కోట్లు మిగిలినట్లేనని అన్నారు. వాళ్ల జీవితంలో సంపాదించుకున్న సొమ్మును ఎన్నికల్లో పెట్టేసి అనవసరంగా పిల్లల్ని రోడ్డు పాలు చేయొద్దని పిలుపుఇచ్చారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే ఏదో ఒక మార్గంలో సంపాదించుకొనే పరిస్థితి.. దాన్ని తర్వాత మళ్లీ ఎన్నికల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఖర్చు తప్ప రాబడి అనేది లేకుండా ఉందని అన్నారు. ఎమ్మెల్యే గెలిచాక ఏడుస్తాడు.. ఓడినవాడు, టికెట్ లేని వాడు ముందే ఏడుస్తాడని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో తాము ఇమడలేమని స్పష్టం చేశారు.