Crimea Bridge Fire: 


క్రిమియాలోని బ్రిడ్డ్‌పై దాడి


రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ద వాతావరణం చల్లారడం లేదు. రోజురోజుకీ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. రష్యా బలగాలను ఉక్రెయిన్ సైన్యం గట్టిగానే ఎదుర్కొంటోంది. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుదాడుల హెచ్చరికలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సంచలన ఘటన జరిగింది. రష్యా ఆక్రమిత క్రిమియాలోని ఓ బ్రిడ్జ్‌పై బాంబు దాడి జరిగింది. ఓ ట్రక్‌లో బాంబ్ పేలడం వల్ల ఆ వంతెన పూర్తిగా డ్యామేజ్ అయింది. రష్యాను-క్రిమియాను అనుసంధానించే కీలకమైన బ్రిడ్జ్ ఇదే. దీనిపైనే అటాక్ జరగటంపై రష్యా అప్రమత్తమైంది. విచారణకు ఆదేశించింది. రష్యా విచారణ కమిటీ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. రష్యా యాంటీ టెర్రరిజం కమిటీ కూడా అప్రమత్తమైంది. ట్రక్ బాంబ్ పేలటం వల్ల వంతెనపై రెండు చోట్ల భారీ డ్యామేజ్ జరిగిందని వెల్లడించింది. అయితే...ఎవరిపైన అయినా అనుమానాలున్నాయా అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ 70 వ పుట్టిన రోజు జరుపుకున్న మరుసటి రోజే ఈ దాడి జరగటం చర్చకు దారి తీసింది. క్రిమియా అనేది రష్యాకు చాలా కీలకమైన ప్రాంతం. చెప్పాలంటే...ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది రష్యా. అంతే కాదు. మిలిటరీ ఆపరేషన్స్ చేపట్టేందుకూ క్రిమియా చాలా వ్యూహాత్మకం. క్రిమియాకు ఆయుధాలు తరలించా లంటే...ఇప్పుడు బాంబు దాడి జరిగిన వంతెనే కీలకం. ఒకవేళ ఇది పూర్తిగా ధ్వంసమై వినియోగించేందుకు వీల్లేకుండా పోతే రష్యా చాలా నష్టపోవాల్సి వస్తుంది. రక్షణపరంగానూ రష్యాకు ఇది ప్రమాదకరమే. 


ఉక్రెయిన్ పనేనా? 


క్రిమియాకు ఉత్తరాన ఉన్న అన్ని ప్రాంతాలనూ రష్యా ఆక్రమిస్తూ వచ్చింది. అజోవ్ సముద్రం మీదుగా ల్యాండ్ కారిడార్‌ కూడా నిర్మించింది. ఈ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి దక్కించుకోవాలని ఉక్రెయిన్ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడెలాగో యుద్దం జరుగుతోంది కాబట్టి..ఎలాగైనా
వాటిని తిరిగి సంపాదించుకోవాలని చూస్తోంది. ఇప్పుడు క్రిమియాలోని బ్రిడ్జ్‌పై బాంబు దాడి జరగటం వల్ల ఉక్రెయిన్ సైన్యమే ఈ పని చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే...రష్యా మాత్రం నేరుగా ఈ ఆరోపణలు చేయటం లేదు. కానీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారు మాత్రం "ఇది ఆరంభం మాత్రమే" అని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. తామే ఈ పని చేశామని నేరుగా చెప్పకపోయినా...ఆయన మాటల్లో అదే అర్థం వినిపిస్తోందని కొందరు భావిస్తున్నారు. "అక్రమంగా సాధించుకున్నవన్నీ తిరిగిచ్చేయాలి, రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను వదిలెళ్లాలి" అని ట్వీట్ చేశారు. గతంలో క్రిమియాలో రష్యాకు చెందిన మోస్క్‌వా మిజైల్ క్రూజర్ సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు ఈ వంతెన ధ్వంసమైంది. ఈ రెండు ఘటనలను పోల్చుతూ...ఉక్రెయిన్ రక్షణ శాఖ "క్రిమియాలో రష్యా పతనం మొదలైందనటానికి ఇవే ఉదాహరణలు" అని వ్యాఖ్యానించింది.