Crimea Bridge Collapse:


నిఘా రెట్టింపు


రష్యా ఆక్రమిత క్రిమియాలోని కెర్చ్ వంతెనపై బాంబు దాడి జరగటంపై పుతిన్ అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం. ఇది కచ్చితంగా ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపిస్తోంది. అంతకు ముందు ఉక్రెయిన్‌ ఉన్నతాధికారులు ఈ బ్రిడ్జ్‌ను కూల్చివేస్తామని హెచ్చరికలు చేసిన విషయాన్నీ రష్యా గుర్తు చేస్తోంది. అయితే...ఇది ఉక్రెయిన్ చేసిందనటానికి ప్రస్తుతానికిఆధారాలైతే ఏమీ లేవు. ఏదేమైనా ఈ వంతెనపై దాడి జరగటాన్ని రష్యా సహించలేకపోతోంది. అందుకే...ఈ వంతెనపై భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పుతిన్ ఓ డిక్రీ పాస్ చేశారట. ఈ ఘటన జరిగాక అర్ధరాత్రి అధికారులతో సమావేశమై అప్పటికప్పుడు డిక్రీపై సంతకం చేశారట. రష్యా, క్రిమియా మధ్య అత్యంత కీలకంగా భావించే ఈ బ్రిడ్జ్‌పై ఇకపై రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ నిఘా పెట్టనుంది. అంతే కాదు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా దూకుడు పెంచనుంది. ఎయిర్‌ ఫోర్స్ చీఫ్ జనరల్ సెరెగి సురోవికిన్ ఉక్రెయిన్‌లోని రష్యా దళాలకు నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. మునుపటి కన్నా వేగంగా ఆక్రమణ కొనసాగించాలని భావిస్తోంది రష్యా. కానీ...ఇప్పటికే రష్యా చాలా నష్టపోయింది. యుద్ధం చేస్తోందన్న పేరే కానీ...అటు ఉక్రెయిన్ సైన్యం గట్టిగానే పోరాడుతోంది. 










ఆయుధాల తరలింపు


ఇప్పుడు కూలిన వంతెన మొత్తం 19 కిలోమీటర్ల మేర ఉంటుంది. బ్లాక్‌ సీని, అజోవ్ సముద్రాన్ని కలిపే మార్గం ఇదే. 2014లో క్రిమియాను ఆక్రమించుకుంది రష్యా. అప్పటి నుంచి ఈ వంతెన మీదుగానే వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తోంది. సైనికపరంగా చూసుకున్నా ఆయుధాల తరలింపునకు ఈ మార్గాన్నే వినియోగిస్తోంది. 3.6 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ బ్రిడ్జ్‌ నిర్మించారు. ఐరోపాలోనే అతి పెద్ద వంతెన ఇది. దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా సైనిక కార్యకలాపాలు సాగించేందుకూ ఈ బ్రిడ్జే కీలకం. 2018లో దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ దీనిపై ప్రత్యేక నిఘా ఉంచారు. 


Also Read: Three Capitals Politics : రాజీనామాలు, రాజకీయాలు సరే మూడు రాజధానులకు మార్గముందా ? చట్టం ఏం చెబుతోంది ?