అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో 2 వీలర్, 4 వీలర్ వాహనదారులు ఖర్చులతో బెంబేలెత్తుతున్నారు. చాలా మంది తమ వెహికిల్స్ ను ఇళ్లకే పరిమితం చేసి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఆశ్రయిస్తున్నారు. దీనికితోడు కాలుష్యం కూడా ఎక్కువగా పెరిగిపోతుండటంతో  ఎలక్ట్రానిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారుల ఆసక్తి మేరకు పలు కంపెనీలు వివిధ మోడళ్లలో వాహనాలను తీసుకురావడం, రాష్ట్ర సర్కారు సైతం ప్రోత్సహిస్తూ ఉండడంతో వీటి విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. 


రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు
ఈ వెహికల్స్ నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేకుండా, వాహనానికి రిజిస్ట్రేషన్ కూడా లేకుండా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా విద్యుత్ వాహనాలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఈ వెహికిల్స్ బ్యాటరీలు పేలుతున్నప్పటికీ, అవి నాణ్యత లేని కంపెనీల వాహనాలు అని కేంద్రం చెబుతోంది. వాటిపై విచారణ సైతం చేపట్టింది. అయితే తమ అవసరాల నిమిత్తం వాహనదారులు ఎలాంటి శబ్దకాలుష్యం కూడా చేయకుండా దూసుకెళ్తున్నారు. 


ఒక్కసారి ఛార్జింగ్ పెడితే కనీసం 100 కిలోమీటర్ల దూరం వెళ్లే అవకాశం ఉండడంతో పరిసర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రజలు కూడా వీటిని కొనుగోలు పై ఆసక్తి చూపుతున్నారు. వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చిపోయే వారు కూడా వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. వెహికల్స్ దూసుకెళ్తున్నప్పటికి వినియోగదారులను ఛార్జింగ్ భయం వెంటాడుతుంది. మార్కెట్లో మోడళ్లను బట్టి ఒక్కో వెహికిల్ 50 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వాహనాలు ఉన్నప్పటికీ పెరిగిన ప్రయాణాలతో ఛార్జింగ్ చేయడం పెద్ద సమస్యగా మారుతుంది. ఈ క్రమంలో వారి అభ్యర్థన మేరకు తెలంగాణ సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో గుర్తించి ఆయా చోట్ల ఛార్జింగ్ సెంటర్లు ఇన్స్టాలేషన్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రతి లొకేషన్లో ఫాస్ట్ స్పీడ్, స్లో స్పీడ్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 
కరీంనగర్‌లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
నగరంలోని జ్యోతి నగర్ లోని మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా, మున్సిపల్ పార్క్ పక్కన, జడ్పీ క్వార్టర్స్ లో, మాతాశిశు సంరక్షణ కేంద్రం పక్కన,ఉమెన్స్ డిగ్రీ కళాశాల సమీపంలో, సంగీత మొబైల్ పక్కన, కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న ఇరిగేషన్ స్థలంలో, ఆర్టీసీ వర్క్ షాప్ పక్కన ఆర్టీసీ హాస్పిటల్ ప్రాంగణంలో, ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో, కలెక్టరేట్ రాంనగర్ లోని మార్కుఫెడ్ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో, బొమ్మకల్ బైపాస్ రోడ్ లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేశారు. అయితే ఆయా ప్రాంతాల్లో గుర్తించిన మేరకు భూమి రెవిన్యూ శాఖ నుంచి టీఎస్ రెడ్ కోకు అప్పగించాల్సి ఉంది. 
ఎన్‌ఓసీ ఇచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఛార్జింగ్ స్టేషన్లు ఇన్‌స్టాలేషన్ చేయనున్నారు. కాలుష్య నివారణకు తోడు, చమురు ధరల బారి నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సూచనతో జిల్లా కేంద్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వాహనాలు 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోనే తిరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే ఈ వాహనదారులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది.200 కిలోమీటర్ల దాకా తిరిగే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ సెంటర్ కు భూమిఅప్పగిస్తూ ఎన్వోసీ ఇచ్చిన వెంటనే ఛార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, టీఎస్ రెడ్కో డీఎం పరమాచారి తెలిపారు.