అయోధ్య.. రాముడి జన్మస్థలం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అయోధ్యకు పూర్వవైభవం తీసుకురావాలని, ప్రపంచంలోనే ప్రముఖ పర్యటక ప్రదేశంగా మార్చాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఇప్పటికే ఒక గ్రాండ్ ప్లాన్ కూడా రెడీ చేసింది. ఇటీవల మోదీ ఈ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్లాన్ లో కళ్లుచెదిరే విశేషాలు ఉన్నాయి. సుందర వనాలు, అందమైన ఘాట్ లు, చెరువులను అభివృద్ధి చేసి ప్రకృతి రమణీయంగా అయోధ్యను తీర్చిదిద్దనున్నారు. 



  1. 14 ఏళ్ల పాటు రాముడి చేసిన అరణ్యవాసంలో ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టేలా తీర్చిదిద్దనున్నారు.

  2. అయోధ్య చుట్టూ 65 కిమీ మేర రింగ్ రోడ్డు నిర్మాణం.

  3. సనాతన ధర్మానికి అనుగుణంగా గొప్ప ఆధ్యాత్మిక, పర్యటక నగరంగా అయోధ్యను తయారు చేయడం.

  4. వాయు, నీటి కాలుష్యరహితంగా నగరాన్ని తీర్చిదిద్దడం. 

  5. 'చారిత్రక గొప్పతనం, ప్రస్తుత అవసరం, భవిష్యత్ కోసం నిర్మాణం' అనే థీమ్ తో ప్రభుత్వం నగర నిర్మాణం చేపట్టనుంది.

  6. 'ప్రపంచ తొలి స్మార్ట్ వేదిక్ సిటీ'గా అయోధ్యను తయారు చేయనుంది.


డ్రీమ్ ప్రాజెక్ట్ లు..


మౌలిక సదుపాయాలు..


ఈ ప్లాన్ లో ఉన్న అతిపెద్ద ప్రాజెక్ట్ లలో ఒకటి 'మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం'. అయోధ్యకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ స్థాయి రైల్వేస్టేషన్ ను నిర్మించాలని చూస్తున్నారు. అయోధ్యకు వచ్చే దారులన్నీ కలిపి 4 నుంచి 6 లేన్లుగా మార్చనున్నారు. శ్రీరామ మందిర ఖ్యాతిని తెలియజేసేలా అతిపెద్ద ద్వారాలతో అయోధ్యకు 6 ప్రధాన ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. త్వరలోనే 65కిమీ పెద్ద రింగ్ రోడ్డు పనులను జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్ హెచ్ ఏఐ) ప్రారంభించనుంది.


సుందరీకరణ పనులు..


ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో జంతారా వద్ద సరయూ నదీ తీరంలో 'రామ స్మృతి వనం' నిర్మించనున్నారు. ఇందులో పూర్తిగా పాదచారులకే ప్రవేశం ఉంటుంది. సీతా, లక్ష్మణ సమేతంగా రాముడి చేసిన వనవాస విశేషాలను ఇందులో ప్రత్యేకంగా చూపిస్తారు. దీనితో పాటు దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో  ఒక వేద పట్టణాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆశ్రమాలు, 5 స్టార్ హోటల్స్, దేశవిదేశాల నుంచి వచ్చే వారు ఉండటానికి విదేశీ, రాష్ట్ర భవనాలు నిర్మించనున్నారు. ఈ టౌన్ షిప్ లో సౌర, విద్యుత్ వాహనాలే నడవనున్నాయి. దీనికి మధ్యలో రామ మందిర గుమ్మటాన్ని పోలి ఉండేలా బ్రహ్మ స్థానాన్ని కట్టనున్నారు.


అత్యాధునిక వసతులు..


208 ఆధ్యాత్మిక ప్రదేశాలతో ప్రపంచస్థాయి పంచకోశీ మార్గాన్ని అయోధ్య చుట్టూ ఏర్పాటు చేయనున్నారు. ఇందులోనే ఘాట్ లు, కొలనులు, వినోద, ఆధ్యాత్మిక ప్రాంతాలను తీర్చిదిద్దనున్నారు. సరయు నది వద్ద దీపావళి పండుగకు ఈ నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. ఆటోమేటిక్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ వ్యవస్థ, 6 మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణాలు చేయనున్నారు.


30 వేల మంది యాత్రికులకు ఆతిథ్యం ఇవ్వగలిగే ధర్మశాలలు నిర్మించనున్నారు. సరయు నది ఘాట్ లు, జానకీ ఘాట్ లను కేంద్ర పర్యటక శాఖ ద్వారా స్వదేశీ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తారు. రామ కథ మ్యూజియంను ప్రపంచస్థాయి డిజిటల్ మ్యూజియంగా మార్చనున్నారు.

 

ఒక్కసారైనా..

 

ఈ ప్రాజెక్ట్ లను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. రాముని ఆదేశాల ప్రకారం రామసేతువు ఎలా నిర్మితమైనదో.. అలానే రాముడి ఆశీస్సులతో అయోధ్య అభివృద్ధి సైతం అలానే జరుగుతుందని ప్రభుత్వం తెలియజేస్తోంది. భవిష్యత్తు తరాలు.. తమ జీవితంలో ఒక్కసారైనా అయోధ్యను చూడాలనుకునేలా నగరాన్ని మారుస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే చెప్పారు.