Covid 19 Cases:
మళ్లీ అలజడి..
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా అలజడి మొదలైంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలందరూ మళ్లీ కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 3,824 కేసులు నమోదయ్యాయి. ఆర్నెల్లలో ఇదే అత్యధికం. మార్చి 31వ తేదీన 3,095 కేసులు నమోదయ్యాయి. అవే ఎక్కువ అనుకుంటే...ఇప్పుడా రికార్డునీ అధిగమించి కేసులు పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేస్‌లు 18,389గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా అక్కడ 416 మంది కరోనా బారిన పడ్డారు. గత 7 నెలల్లో ఇదే అత్యధికం. ప్రస్తుతం అక్కడ పాజిటివిటీ రేటు 14.37%గా ఉంది. కరోనా సోకి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 26,529గా ఉందని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీ తరవాత ఆ స్థాయిలో మహారాష్ట్రలో కేసులు నమోదవుతున్నాయి. ముంబయిలో కొత్తగా 347 మంది కరోనా బారిన పడ్డారు.