Andhra Pradesh And Telangana Latest Weather : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రతి రోజూ ఫ్రైడేగానే ఉంటోంది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు అధికంగా నమోదు అవుతున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మార్చి నెల మధ్యలోనే ఎండలు ఇలా ఉంటే భవిష్యత్‌లో ఇంకా ఎంత పెరుగుతాయో అని కంగారుపడిపోతున్నారు. 


మండిపోతున్న ఎండలు సమయంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖాధికారులు ఆనందకరమైన వార్త చెప్పారు. వచ్చే మూడు రోజులపాటు వాతావరణం చల్లబడేలా వర్షాలు పడతాయని చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని అంటున్నారు. వడగండ్లు కూడా పడొచ్చని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. 


హైదరాబాద్‌లో మార్చి 20 నుంచి వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఉరుమలతో కూడిన వర్షాలు పడతాయని వాతావారణ శాఖ అంచనా వేసింది. మిగతా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వానలు పడతాయని చెబుతున్నారు. 




మార్చి 20 నుంచి వాతావరణంలో చాలా మార్పులు వస్తాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వచ్చాయి. కానీ వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని చెబుతున్నారు.  మార్చి 22న సెంట్రల్, నార్త్ తెలంగాణలో ప్రారంభమయ్యే వాతావరణ మార్పు మార్చి 23, 24న దక్షిణ, తూర్పు తెలంగాణ వరకు విస్తరించనుంది. తూర్పు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. 


మార్చి 22, 23 తేదీల్లో తెలంగాణలోని మంచిర్యాలు, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, గద్వాల్‌లలో ఈదురు గాలులుతో కూడిన వర్షాలు పడతాయి.  


22, 23తేదీల్లో హైదరాబాద్ నగరంతోపాటు మరో 17 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, మేడ్చల్, యాదాద్రి, సూర్యాపేట, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి , నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వడగండ్ల  వానలు కురుస్తాయి. బలమైన గాలులు కూడా వీస్తాయి. 




ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ ఎండలు మరింత మండుతున్నాయి. ఇవాళ శ్రీకాకుళం జిల్లా-13, విజయనగరం-18,మన్యం-14, అల్లూరి -3, కాకినాడ-2, తూర్పుగోదావరి-7, ఏలూరు-1 ఇలా రాష్ట్రవ్యాప్తంగా 58  మండలాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. ఉత్తరాదిలో వచ్చిన వాతావరణ మార్పుల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కూడా పడనుంది. అందుకే  గురువారం 37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.