Liqour Free discussion in Assembly: ప్రభుత్వానికి ఆదాయం పెంచడం ఎలా అన్న అంశంపై జరిగిన చర్చ.. ఎటో వెళ్లి కొత్త ఐడియాలకు దారి తీసింది. ప్రభుత్వాలు ఆదాయం పెంచుకోవాలంటే కనిపించే ఒకే ఒక మార్గం  ఎక్సైజ్ రెవిన్యూ. మందుబాబులపై ఎంత బాదినా ఎవరూ అడగరు. అక్కడా ఇక్కడా అని లేదు అన్నిచోట్లా ప్రభుత్వాలు చేస్తున్న పని అది. ప్రతీ ఏటా తాగే వాళ్లు పెరుగుతున్నారు. దానితో పాటు వచ్చే రెవిన్యూ కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. అయితే ఆదాయాన్ని పెంచుకోవడానికి వారిపై రుద్దే టాక్సులు ఏమీ తక్కువ కాదు. ఎడాపెడా మద్యం టాక్సులను పెంచుతూనే ఉంటారు. పేదవాళ్లైనా.. పెద్దవాళ్లైనా అలవాటు ఉంది కాబట్టి తప్పనిసరిగా వాటిని కొనుగోలు చేసేవాళ్లు మద్యం వినియోగదారులే. అయితే వారి బాధను ఓ ఎమ్మెల్యే అర్థం చేసుకున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా మద్యం రేట్లు పెంచుకుంటే వెళితే వాటిని ఎక్కువుగా తాగే పేద వర్గాల వారు ఏమవుతారని ప్రశ్నించారు. అంతే కాదు వాళ్లకి వారానికి రెండు బాటిళ్లు మద్యం ఫ్రీగా ఇవ్వాలని కూడా ఏకంగా అసెంబ్లీలోనే డిమాండ్ చేశారు. కర్ణాటక అసెంబ్లీలో జరిగింది ఈ సంఘటన.


వారానికి రెండు బాటిళ్లు ఇవ్వాలన్న క్రిష్ణప్ప


కర్ణాటక అసెంబ్లీలో ఎక్సైజ్ రెవిన్యూ ఎలా పెంచాలన్న దానిపై జరిగిన చర్చ.. మద్యం బాటిళ్లు ఉచితంగా అందించాలనే దానిపైకి వెళ్లింది. ఓ సీనియర్ ఎమ్మెల్యే వారానికి రెండు బాటిళ్లు ఉచితంంగా ఇవ్వాలని కోరగా.. మరొకరు పూర్తిగా నిషేధం విధించాలన్నారు


2025-26 బడ్జెట్‌లో ఎక్సైజ్ రెవిన్యూ లక్షాన్ని  ప్రస్తుతం ఉన్న ౩6,500 కోట్ల నుంచి 40,౦౦౦ కోట్లకు పెంచారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.


ఒక్క ఏడాదిలోనే మద్యం పన్నులను మూడుసార్లు పెంచారు. ఇది పేదలపై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పుడు ఎక్సైజ్ టార్గెట్‌ను 40వేల కోట్లు అని చూపించారు. టాక్స్‌లను పెంచకుండా ఈ రెవిన్యూ ఎలా వస్తుందని”JD(S) కు చెందిన  Tiruvekere ఎమ్మెల్యే MT Krishnappa  ప్రశ్నించారు.


మందుబాబుల డబ్బులతో పథకాలు ఇస్తారా…?


మద్యం నుంచి వచ్చిన ఆదాయంతోనే రాష్ట్రంలో ఉచిత పథకాలను అమలు చేస్తున్నారని కృష్ణప్ప ఆక్షేపణ తెలిపారు.


“మనం మద్యం తాగకుండా ప్రజలను ఆపలేం. ముఖ్యంగా కార్మిక వర్గానికి చెందిన వారిని నియంత్రించలేం. వాళ్ల డబ్బులతో మహిళలకు ప్రతీనెల 2000 ఇస్తున్నారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం ఇవన్నీ కూడా వాళ్లు తాగితే వచ్చిన డబ్బుతో ఇస్తున్నవే.  వాళ్లని తాగనివ్వండి వాళ్లకి ఎలాగో మనం ప్రతీనెలా డబ్బులు కూడా ఇవ్వలేం కదా..”  అని ఆయన అన్నారు.


ఆ తర్వాత కొనసాగిస్తూ..  “మందు తాగుతున్న మగాళ్లకు కూడా ఏదైనా చేయాలి. వాళ్లకి ప్రతీ వారం రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వండి. ఇందులో తప్పేముంది. ప్రభుత్వం సొసైటీల ద్వారా వారికి మద్యం సరఫరా చేయాలని” అనడంతో అసెంబ్లీ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది.  


దీనికి ప్రభుత్వం తరపున ఇంధన మంత్రి కె.జె.జార్జి సమాధానం ఇస్తూ.. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. మద్యపాన వినియోగాన్ని తగ్గించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నేత బీఆర్‌పాటిల్ మాట్లాడుతూ మద్యాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు.


“ఎక్సైజ్ రెవిన్యూ.. ఇది పాపిష్టి సొమ్ము. మనం పేదవారి రక్తాన్ని పిండి సంపాదిస్తున్న డబ్బు. దీనితో జాతి నిర్మాణం చేయలేం” అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించే ఆలోచన చేయాలనిఆయన వ్యాఖ్యానించారు. “తాను ఓ రెండు గంటలపాటు  నియంతగా ఉంటే దేశంలోని మద్యాన్ని నిషేధిస్తానని స్వయంగా మహాత్మాగాంధీ అంతటి వారు అన్నారు” అని గుర్తు చేశారు.


బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్  అరవింద్ బెల్లాడ్ కూడా మద్యం ఆదాయం పెరుగుతూ పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. “మనం గృహలక్ష్మి పథకం కింద నెలకు 2వేల చొప్పున ఏడాదికి మహిళలకు 28వేల కోట్లు ఇస్తున్నాం. అదే మద్యం ఆదాయం పేరిట వారి నుంచి 36వేల కోట్లు పిండుకుంటున్నాం. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. బిహార్ లో ఎక్సైజ్‌పై ఎలాంటి ఆదాయం లేకుండానే అక్కడ ప్రభుత్వం నడుస్తోంది. గుజరాత్‌లో ఎక్సైజ్‌ నుంచి వచ్చే ఆదాయం 0.1శాతం మాత్రమే” అన్నారు 


మంత్రి ప్రియాంక్‌ ఖర్గే దీనికి సమాధానం ఇస్తూ.. "బీజేపీ ఉన్నప్పుడు కూడా కర్ణాటకలో ఎక్సైజ్ ఆదాయం 35000 కోట్లు ఉందని..  ఇప్పుడు కొత్తగా వచ్చి నీతులు చెప్పొద్దన్నారు. చేతనైతే.. మద్య నిషేధంపై తీర్మానం కోసం ప్రపోజల్ పెట్టమని" చరుకలు అంటించారు.