PM Modi Targets Opposition:


ప్రతిపక్షాలపై అసహనం..
 
రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసిన తరవాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులందరూ ఒక్కటయ్యారంటూ విమర్శించారు. మొత్తం 14 ప్రతిపక్ష పార్టీలపైనా మాటల దాడి చేశారు. దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపిస్తూ...సుప్రీం కోర్టుని ఆశ్రయించడంపైనా అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 


"రాజ్యాంగబద్ధ సంస్థల పునాది చాలా బలంగా ఉంది. అందుకే భారత్‌పైన దాడి చేయాలనుకునే వాళ్లు ఆ సంస్థలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగిన ప్రతిసారీ ఇలాంటి విమర్శలే చేస్తున్నారు. కోర్టులకు వెళ్లి ప్రశ్నిస్తున్నారు. కొన్ని పార్టీలైతే అవితీనిపరులను కాపాడే కొత్త పథకం మొదలు పెట్టాయి"


- ప్రధాని నరేంద్ర మోదీ






లోక్‌తంత్ర బచావో పేరిట కాంగ్రెస్ చేస్తున్న నిరసనలనూ ఖండించారు మోదీ. అవినీతిని అడ్డుకుంటున్నామన్న తమ పార్టీ అభిప్రాయాన్ని చాలా గట్టిగా సమర్థించారు. 


"కాంగ్రెస్‌ హయాంలో మనీ లాండరింగ్ చట్టం ప్రకారం వెలుగులోకి వచ్చిన స్కామ్‌ల విలువ కేవలం రూ.5 వేల కోట్లు. కానీ బీజేపీ వచ్చాక రూ.10 లక్షల కోట్ల అవినీతి బయటపడింది. ఇలాంటి హవాలా లావాదేవీలు చేసిన 20 వేల మందిని అదుపులోకి తీసుకున్నాం. అవినీతిపరులపై ఈ స్థాయిలో చర్యలు తీసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మేం ఇంత చేస్తున్నాం కాబట్టే ప్రతిపక్షాలు అలా అసహనానికి గురవుతున్నాయి. అయినా సరే అవినీతి పరులపై చర్యలు మాత్రం ఆగవు. వాళ్లు చేసేవి తప్పుడు ఆరోపణలు అని ప్రజలు తెలుసుకుంటారు"


- ప్రధాని నరేంద్ర మోదీ






ఇప్పటికే 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టుని ఆశ్రయించాయి. దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ పిటిషన్ వేశాయి. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 15న విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.  రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ అంశంపై వివిధ రూపాల్లో నిర‌స‌న‌లు తెలుపుతూ అధికార బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు ఆ పార్టీ కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ముందుగా ఏకపక్షంగా వ్యవహరించి రాహుల్‌గాంధీపై వేటు వేశారంటూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌ ఎంపీలంతా సమావేశమై ఈ విష‌యంపై చ‌ర్చించారు.


Also Read: DK Shivakumar: ఎన్నికల ప్రచారంలో నోట్ల వర్షం కురిపించిన కాంగ్రెస్ నేత, వీడియో వైరల్