Coronavirus Spike:
మన్‌సుఖ్ మాండవీయ మీటింగ్..
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భేటీలో అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లోని వైరస్ వ్యాప్తిపై ఆరా తీశారు. కొవిడ్ టెస్ట్‌లతో పాటు, జీనోమ్ సీక్వెన్సింగ్ గురించీ ప్రస్తావించారు మన్‌సుఖ్ మాండవీయ. ఎవరూ ఆందోళన చెందకూడదని, అప్రమత్తంగా ఉండి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులు రివ్యూ మీటింగ్‌లు నిర్వహించాలని తెలిపారు. ప్రికాషనరీ డోసులు పంపిణీ చేయాలని తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీష్ రావు అడగగా...అందుకు మాండవీయ అనూహ్యంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని కొనుగోలు చేసుకోవాలని చెప్పారు.
"ఇప్పుడు మనమంతా అప్రమత్తంగా ఉండాలి. అనవసరపు భయాలు పెట్టుకోవద్దు. అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు రివ్యూ మీటింగ్ నిర్వహించాలి. మౌలిక వసతులు ఎలా ఉన్నాయో సమీక్షించుకోవాలి. ఆ మేరకు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఏప్రిల్ 10, 11వ తేదీల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలి. అన్ని ఆసుపత్రులనూ సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా అన్ని చర్యలు తీసుకోవాలి. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు. హాట్‌స్పాట్‌లు గుర్తించడమే కీలకం. అలాంటి చోట్ల టెస్టింగ్ సంఖ్యను పెంచాలి. "
- మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి