Corona Tests In India:
2 లక్షల మందికి టెస్ట్..
కరోనా ఉద్ధృతి పలు దేశాల్లో కొనసాగుతూనే ఉంది. చైనా, జపాన్, సౌత్ కొరియా అమెరికాలో కేసులు పెరుగుతున్నాయి. మరణాల రేటు కూడా పెరుగుతోంది. ఇవన్నీ చూసి అప్రమత్తమైన భారత్...కట్టడి చర్యలు మొదలు పెట్టింది. ఎప్పటికప్పుడు కరోనా వ్యాప్తిపై నిఘా పెడుతోంది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం...గత 24 గంటల్లో కొత్తగా మరో 175 మంది కరోనా బారిన పడ్డారు. యాక్టివ్ కేసులు 2,570 కి పెరిగాయి. 220 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లు ఇప్పటి వరకూ అందించింది భారత్. గత 24 గంటల్లో 187 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 41 లక్షలకు పైగానే నమోదైంది. రికవరీ రేటు 98.8%గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.09%గా
ఉంటోందని కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 91.13 కోట్ల కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. అయితే...ఈ మధ్య కాలంలో టెస్ట్‌ల సంఖ్య వేగాన్ని పెంచారు. ఒమిక్రాన్ వ్యాప్తి కలవరంతో అన్ని చోట్లా అధికారులు అలెర్ట్ అయ్యారు. గత 24 గంటల్లోనే 2 లక్షలకుపైగా టెస్ట్‌లు చేశారంటే...ఎంత అప్రమత్తంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. BF.7 వేరియంట్ ఇప్పటికే చైనాను వణికిస్తోంది. ఇదే వేరియంట్ కేసులు భారత్‌లోనూ నమోదవుతున్నాయి. అందుకే...అంతా భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం నిఘా పెంచింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తోంది. ఇక యాక్టివ్ కేసుల విషయానికొస్తే...ఎక్కువగా కేరళ, కర్ణాటకలోనే నమోదవుతున్నాయి. సగానికి పైగా కరోనా కేసులు నమోదైంది కేరళలోనే. ఆ తరవాత కర్ణాటక, మహారాష్ట్రలోనూ వ్యాప్తి పెరుగుతోంది.
చైనా నుంచి వచ్చే వారిపై నిఘా..
చైనాలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. రోజూ లక్షలాది మంది కొవిడ్ బారిన పడుతున్నారు. మృతుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతోంది. చైనాలో పరిస్థితులు చూసి ప్రపంచమంతా భయపడుతోంది. మరోసారి కొవిడ్ సునామీ తప్పదేమో అని ఆందోళన చెందుతోంది. ఒక్కో దేశమూ అప్రమత్తమవుతున్నాయి.విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు కెనడా కూడా ఈ దేశాల జాబితాలో చేరిపోయింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా పెడుతోంది. ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులెవరైనా తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని తేల్చి చెప్పింది. చైనాతో పాటు హాంగ్‌కాంగ్, మకావ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కరోనా పరీక్ష చేయించుకోవాలని వెల్లడించింది. జనవరి 5వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ప్రభుత్వం
తెలిపింది. కెనడాకు వచ్చే ముందు టెస్ట్ చేయించుకుని నెగటివ్ రిపోర్ట్‌ను చూపించాల్సి ఉంటుంది. అలా అయితేనే...ఫ్లైట్ ఎక్కనిస్తారు. చైనా, హాంగ్‌కాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా RT PCR టెస్ట్‌లు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో ఫ్లైట్ ఎక్కే ముందే ఈ టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్ట్‌ని Air Suvidha పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని వెల్లడించింది.