New Corona Cases :    దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఒక్క రోజులో లక్ష మందికిపైగా  కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,134 కొత్త కేసులు బయటపడ్డాయి.  ప్రస్తుతం దేశంలో 7,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,30,813కి చేరింది. దేశ వ్యాప్తంగా 4,41,60,279 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో చత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు మరణించారు. ఎక్స్‌బీబీ1.16 కరోనా కొత్త వేరియంట్‌ తో ఈ నెల 20వ తేదీ వరకు మహారాష్ట్రలో 104 కేసులు, కర్ణాటకలో 57, గుజరాత్‌లో 54, ఢిల్లీలో 19, పుదుచ్చేరిలో 7, హరియాణాలో 6, హిమాచల్‌ ప్రదేశ్‌లో 3 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు 93 నమోదయ్యాయి. 


గడచిన ఎనిమిది రోజుల్లో దేశంలో ఏడు రోజుల రోజువారీ సగటు కేసులు రెట్టింపయ్యాయి. మార్చి 10 నాటికి సగటున 353 కేసులు నమోదుకాగా.. మార్చి 18 నాటికి 704కి చేరాయి. గతవారం డబులింగ్ రేటు 11 రోజులకు సమీపంగా ఉంది. అంటే, ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుందనడానికి ఇదే సంకేతం. అలాగే, యాక్టివ్ కేసులు ముందు వారం 3,778 ఉండగా.. గడచిన వారం 6వేలు దాటాయి. అయితే, దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు మాత్రం చాలా తక్కువగానే ఉంది. టెస్ట్ పాజిటివిటీ రేటు శనివారం 1 దాటింది. వారం రోజుల సగటు క్రమంగా పెరుగుతూ 0.8 శాతానికి చేరింది.


ఈ కేసులు పెరగడానికి  XBB 1.16 వేరియంట్‌ను వైద్యులు గుర్తించారు. దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణంగా భావిస్తున్నారు. అయితే XBB 1.16 వేరియంట్‌ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.  ఓ వైపు  XBB 1.16 వేరియంట్‌ కేసులు..మరో వైపు  హెచ్3ఎన్2 వైరస్ కేసులతో దేశంలో  పరిస్థితి  క్లిష్టంగా మారింది. ప్రజలు ఇప్పటికే ఇన్ ఫ్లొయేంజా బారిన పడి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల రోగనిరోధక శక్తి తగ్గి కోవిడ్ సమస్యను మరింత తీవ్రతరం చేసే అవకాశాలు నిపుణులు చెబుతున్నారు. XBB 1.16 వేరియంట్‌, ఇన్ ఫ్లూయెంజా కేసుల బారిన పడకుండా  రక్షించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.
 
వైరస్ సోకితే అలసట,దగ్గు,తలనొప్పి, గొంతులో మంట ఏర్పడతాయని వెల్లడించారు. ఇన్‌ఫ్లుఎంజా, కోవిడ్ మధ్య వ్యత్యాసం పరీక్ష తర్వాత మాత్రమే కనిపెట్టగలమని వైద్యులు చెబుతున్నారు. అయితే  H3N2 వైరస్ సోకిన వ్యక్తులు అధిక జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలతో ఇబ్బందులు పడతాయన్నారు.  అటు కోవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తులు గొంతు నొప్పి, దగ్గు,జలుబు వంటి లక్షణాలు కలిగి ఉంటారని తెలిపారు.