దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. రూ.1200 కోట్లు వసూళ్లు చేసి వారెవ్వా అనిపించింది. ఇక ప్రపంచ ప్రఖ్యాత అవార్డులను దక్కించుకోవడంలో దుమ్మురేపింది. 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును అందుకుంది.  ఒరిజినల్ సాంగ్‌గా అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతకు ముందే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను సైతం అందుకుంది.


టెస్లా లైట్ షోపై స్పందించిన జక్కన్న


‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలిచిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. ‘నాటు నాటు’ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, రీళ్లు ఇంటర్నెట్‌ లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా న్యూజెర్సీలో టెస్లా లైట్ షో ‘నాటు నాటు’ పాటతో దుమ్మురేపింది. 150కి పైగా కార్లను ఒక్కచోట చేర్చి పాటకు లయబద్దంగా కార్ల లైట్లు వెలిగిస్తూ, ఆర్పేస్తూ ఆకట్టుకున్నారు. ఈ  వీడియోపై రాజమౌళి తాజాగా రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేస‍్తూ అద్భుతమంటూ కొనియాడారు. 


 టెస్లా కార్ల లైట్‌ షో అద్భుతమైన అనుభూతి- రాజమౌళి


“న్యూజెర్సీ నుంచి నాటు నాటు పాటకు మీరు చూపిన అభిమానానికి నిజంగా పొంగిపోయా. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇంతటి అధ్బుతమైన వీడియోను ప్రదర్శించిన ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ‘నాటు నాటు’ సాంగ్‌కు టెస్లా కార్లతో లైట్‌ షో ఒక అద్భుతమైన అనుభూతి. ఆ షో నిర్వహించిన నార్త్‌ అమెరికన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ సభ్యులు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, ఈ లైట్ షోలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు” ” అంటూ ట్వీట్ చేశారు.






నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన ఎలన్ మస్క్


అటు ఇప్పటికే టెస్లా లైట్ షో ‘నాటు నాటు’ పాటతో హోరెత్తడంపై ఆ కంపెనీ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ స్పందించారు. ‘RRR’ ట్విట్టర్ లో పోస్టు చేసిన ఈ వీడియోను ఆయన షేర్ చేశారు. ఈ మేరకు రెండు లవ్ ఎమోజీలను పెట్టారు.  


ప్రపంచ వ్యాప్తంగా ‘నాటు నాటు’ ఫీవర్


రీసెంట్ గా అమెరికా పోలీసులు ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలో స్థిరపడిన కొంత మంది ప్రవాస భారతీయులు హోలీ ఆడుతుండగా, ఇద్దరు పోలీసులు వారితో కలిసి హుక్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. సదరు పోలీసులకు మధ్యలో నిలబడిన భారతీయ వ్యక్తి పోలీసులతో కలిసి స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు. ప్రజల కేరింతల నడుమ వారు చక్కటి స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు.  ఇటీవల ఢిల్లీలో కొరియా దౌత్య సిబ్బంది, జర్మన్ ఎంబసీ ఉద్యోగులు నాటు నాటు పాటకు డ్యాన్స్ వేశారు.    


Read Also: అద్భుతం, న్యూజెర్సీలో కార్ల లైట్లతో ‘నాటు నాటు’ ప్రదర్శన - వైరల్ అవుతోన్న టెస్లా వీడియో, డోన్ట్ మిస్!