Corona Cases: గత రెండ్రోజుల వరకు దేశంలో కోరనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టగా.. మరోసారి పెరుగుతున్నాయి. మంగళవారం రోజు 7 వేల కేసులు నమోదు కాగా.. నేడు 9 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ కేసుల సంఖ్య 44 శాతం ఎక్కువ. కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ వారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,79,031 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 9 వేల 629 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం దేశంలో 61 వేల 13 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక 24 గంటల వ్యవధిలో 11, 967 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ఇలా ఇప్పటి వరకు మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 43 లక్షల 23 వేల 45కు చేరింది.


కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో మొత్తం 29 మంది చనిపోయారు. కేళలో 10 మంది, ఢిల్లీలో ఆరుగురు, మహారాష్ట్ర, రాజస్థాన్ లో ముగ్గురు చొప్పు, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ లో ఇద్దరు చొప్పున, ఒడిశా, గుజరాత్, చత్తీస్ గఢ్  ఒక్కరు చొప్పున  ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 31 వేల 398 కి చేరింది. అలాగే ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.41 శాతం మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్లు కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు వివరించింది. 








తాజాగా పెరుగుతున్న కేసులకు కారణం ఒమిక్రాన్ XBB.1.16  వేరియంట్. దీన్నే ఆర్కుట్‌రస్ అని పిలుస్తారు. మహమ్మారి కరోనా తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న దేశానికి ఈ కొత్త వేరియంట్ వల్ల మళ్లీ భయాంధోళనలు మొదలయ్యాయి. ఇది తీవ్రంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాబట్టి మళ్లీ  జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆర్కుట్‌రస్ వేరియంట్ వ్యాప్తి వేగం అధికంగానే ఉన్నట్టు గుర్తించారు పరిశోధకులు. ఇది యువత, పిల్లలను కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. మనుషుల్లోని రోగనిరోధక శక్తిని తట్టకునే లక్షణాలను కూడా ఇది చూపిస్తోంది. 
 
లక్షణాలు ఇలా...


మ్యుటేషన్ చెందుతున్న కరోనా వైరస్ అన్ని వేరియంట్లు ఒకేలాంటి లక్షణాలను చూపిస్తున్నాయి. 


1. జ్వరం ఎక్కువ కాలం పాటూ వేధించడం
2. ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ వేయడం
3. గొంతు మంట
4. కండ్ల కలక
5. తలనొప్పి
6. తీవ్ర అలసట
7. కండరాలు నొప్పి


పైన చెప్పిన లక్షణాలన్నీ దాదాపు ముందు వేరియంట్లతో కలిగేవే. అయితే కొత్తగా ఇందులో చేరినది పింక్ ఐ (కండ్ల కలక). పింక్ ఐ, కోవిడ్-19తో ఎలా సంబంధం కలిగి ఉంటుందనే దానిపై ఇంకా సరైన సమాచారం లేదు. దీనికి ఎక్కువ పరిశోధన అవసరం. ఇది 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో బయటపడుతున్న లక్షణం. 


జాగ్రత్తలు ఇలా...


1. మునుపటిలాగే బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్కులు పెట్టుకోవాలి. 
2. రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగకూడదు. 
3. హ్యాండ్ శానిటైజర్ ఎక్కువగా వాడాలి.
4. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 
5. బూస్టర్ షాట్ తీసుకోవాలి. 
6. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను రోజూ తీసుకోవాలి.