ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరో లేఖ రాశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు.


రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదులు చేసిన విషయాన్ని సీఎస్‌కు చంద్రబాబు గుర్తు చేశారు. అయినా ఆయా ఫిర్యాదులపై అధికారులు స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. అధికార వైఎస్సార్‌సీపీ నేతలతో ఓ వర్గం అధికారులు కుమ్మక్కై ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని లేఖలో ఆరోపించారు. అనుమతికి మించి ఇసుక తవ్వకాలకు జయప్రకాష్ వెంచర్స్ పాల్పడుతోందని చంద్రబాబు తప్పుపట్టారు. అక్రమ తవ్వకాలపై హైకోర్టులో కూడా విచారణ జరిగిందని గుర్తు చేశారు.


నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతర్ 
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి), ఇతర కోర్టుల నుంచి అనేక ఆదేశాలు ఉన్నప్పటికీ, ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టలేదని చంద్రబాబు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వారిపై దాడులు చేయడం సబబు కాదన్నారు చంద్రబాబు. అక్రమాలను అరికట్టడంలో ప్రభుత్వ శాఖలు, అధికారులు విఫలం అవుతున్నారని చెప్పారు. ఇష్టారీతిన ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం జరగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటిపోక ముందే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను తక్షణమే అరికట్టడంతోపాటు సహజ వనరులను కాపాడుకోవడం చాలా ముఖ్యమని చంద్రబాబు సూచించారు.


నిన్నటి లేఖలో చంద్రబాబు ఏమన్నారంటే..
అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఏపీ సీఎస్ కు చంద్రబాబు మంగళవారం లేఖ వ్రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. పిడుగుపాటుతో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం 25లక్షల పరిహారం ఇవ్వాలన్నారు.


మార్చిలో కురిసిన వర్షాలకు రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయిని, గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చేతికొచ్చే పంట నేలపాలైందని అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి డెల్టా ప్రాంతాల్లో భారీగా వరి పంట దెబ్బతిన్నదని చంద్రబాబు తెలిపారు. కళ్లాల్లో ఆరబెట్టిన వేల టన్నుల ధాన్యం తడిచిపోయిందని, మొక్కజొన్న రైతులు కూడా తీవ్రస్థాయిలో నష్టపోయారని చెప్పారు. ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీగా మిరప పంట దెబ్బతిందని, కోతలు పూర్తి కాక.. ఈదురు గాలుల ధాటికి మిరప రాలిపోయిందని వివరించారు. అరటి, మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, పిడుగులు పడి రైతులు దుర్మరణం బాధాకరమని ఆవేద వ్యక్తం చేశారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని, దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని,వరి, మొక్కజొన్నకు ఎకరాకు రూ.20వేలు, మిర్చి, అరటి, మామిడికి రూ.50 వేలు పరిహారం అందించాలని ఏపీ సీఎస్ కు చంద్రబాబు సూచించారు.