Cops Arrest PFI Cadres: 


40 మంది అరెస్ట్ 


దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)ఆఫీసులలో NIA,ED సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు మూడు రోజులుగా పలు చోట్ల రెయిడ్స్ జరుగుతున్నాయి. వంద మందికిపైగా అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే పుణెలోనూ సోదాలు జరిగాయి. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్నారనే ఆధారాలతో దాదాపు 40 మందిని అరెస్ట్ చేశారు NIA అధికారులు. వీరిలో సింపథైజర్స్ కూడా ఉన్నారు. ఈ అరెస్టులపై PFI పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతోంది. ఆ సమయంలోనే పుణెలో చేపట్టిన ఆందోళనల్లో కలెక్టర్ ఆఫీస్ వెలుపల "పాకిస్థాన్ జిందాబాద్" అని నినాదాలు చేశారు. ఇది స్థానికంగా అలజడి సృష్టించింది. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) కూడా పలు చోట్ల సోదాలు నిర్వహించింది. 12 చోట్ల సోదాలు చేసి...20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది.





పీఎఫ్ఐ కేరళలోనూ సోదాలు చేపట్టటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బంద్‌కు పిలుపునిచ్చింది. దీనిపై కేరళ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై సుమోటో విచారణ జరిపింది. పోలీసులు లేదా కోర్టు నుంచి ముందస్తు అనుమతి పొందకుండా బంద్‌కు పిలుపునివ్వకూడదని కోర్టు పేర్కొంది. పీఎఫ్ఐ పిలుపునిచ్చిన ఈ హర్తాళ్‌ హింసాత్మక ఘటనలకు దారితీసింది. కేరళ రాజధాని తిరువనంతపురం సహా వివిధ జిల్లాల్లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు జరిగాయి. తిరువనంతపురం, కొల్లం, కోజికోడ్, వయనాడ్, అలప్పుజా సహా పలు జిల్లాల్లో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులపై (కేఎస్‌ఆర్‌టీసీ) ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.


దేశవ్యాప్తంగా సోదాలు..


దేశవ్యాప్తంగా NIA సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా NIAతో పాటు ED సోదాలు నిర్వహించింది. మొత్తం 11 రాష్ట్రాల్లోని PFI (Popular Front of India)ఆఫీసుల్లో రెయిడ్స్ చేశారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 106 మందిని అరెస్ట్ చేశారు. ఈ 106 మందిలో అత్యధికంగా కేరళకు చెందిన వారే ఉన్నారు. కేరళలో 22 మంది, మహారాష్ట్ర, కర్ణాటకలో 20 మంది, ఆంధ్రప్రదేశ్ ఐదుగురు, అసోంలో 9 మంది, ఢిల్లీలో ముగ్గురు, మధ్యప్రదేశ్‌లో నలుగురు, పుదుచ్చేరిలో ముగ్గురు, తమిళనాడులో 10 మంది, యూపీలో 8 మందితో పాటు రాజస్థాన్‌లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. మరో కీలక విషయం ఏంటంటే..ఢిల్లీ PFI ప్రెసిడెంట్ పర్వేజ్‌నూ అరెస్ట్ చేశారు NIA అధికారులు. పర్వేజ్‌తో పాటు ఆయన సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. పర్వేజ్‌కు PFIతో ఎంతో కాలంగా అనుబంధం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా...అత్యంత పకడ్బందీగా భారీ సోదాలు చేపట్టాయి NIA,ED.ఇప్పటి వరకూ అరెస్ట్‌ అయిన  వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్న వారి ఇళ్లలో ఈ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. కొందరు ఉగ్రవాదులకు ట్రైనింగ్‌ క్యాంప్‌లూ నిర్వహించారు. ఇంకొందరు యువకులను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారని NIA అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న PFI ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయని Popular Front of India ప్రకటించింది. PFI కమిటీ ఆఫీస్‌ల్లోనూ ఇవి కొనసాగుతు న్నాయని వెల్లడించింది. అయితే..ఈ సోదాల పట్ల PFI అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫాసిస్ట్‌ పాలన అంటూ విమర్శలు చేసింది. 
నోరు నొక్కేయడానికే ఇలా సోదాలు నిర్వహిస్తున్నారంటూ మండి పడింది. 


Also Read: KCR Reservation Politics : ముస్లిం రిజర్వేషన్లకూ జీవో ఇస్తారా ? కేసీఆర్ ముందు మరో క్లిష్టమైన సవాల్ !