Congress: బంగాల్‌లో నోట్ల కట్టలతో పట్టుబడిన తమ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఝార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కశ్యప్, నమన్ బిక్సల్ కొంగరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
భారీ మొత్తంలో డబ్బుతో బంగాల్‌లోని హౌరాలో వీరు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఝార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అవినాశ్ పాండే వెల్లడించారు.
ఇలా జరిగింది
ఓ నల్ల కారులో పెద్దమొత్తంలో నగదు రవాణా అవుతుందని సమాచారం అందడంతో హౌరా జిల్లాలోని జాతీయ రహదారిపై పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. బంగాల్ వైపు నుంచి వస్తున్న కారును పోలీసులు సోదా చేశారు. అందులో పెద్దమొత్తం డబ్బు బయటపడింది. ఇవి ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సల్ కొంగరివిగా గుర్తించారు. కారులో ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఝార్ఖండ్ ఎమ్మెల్యేల వద్ద భారీగా నోట్ల కట్టలు దొరకడంతో కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి భాజపా కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.