Congress President Elections:


అధ్యక్ష పదవికి సరేనంటున్న గెహ్లోట్..


కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎవరి చేపడతారన్న ప్రశ్న కొంత కాలంగా సందిగ్ధంలోనే ఉంది. రాహుల్ గాంధీ ఆసక్తి చూపకపోవటం, వరుసగా పలువురు సీనియర్లు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోవటం ఆ పార్టీని ఇరకాటంలో పెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు సరైన సారథి ఎంతో అవసరం. త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించి...గెలిచిన వారికి ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు సోనియా గాంధీ. ఇప్పటికే ఆమె సీనియర్లను ఒప్పించే ప్రయత్నాలు కూడా మెదలు పెట్టారు. ఈ క్రమంలోనే తెరపైకి వచ్చిన పేరు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్. గతంలో సోనియా...గెహ్లోట్‌ను అధ్యక్షుడిగా ఉండాలని కోరినా...అప్పట్లో సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే...ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓకే అన్నారట. తన అధికారిక నివాసంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో
సమావేశమైన గెహ్లోట్...పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని సంకేతాలిచ్చారట. వైస్‌ప్రెసిడెంట్ జగ్‌దీప్ ధన్‌కర్‌ను విందుకు పిలిచిన అశోక్ గెహ్లోట్...ఈ కార్యక్రమం తరవాత పలువురు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి విధేయుడిగా ఉంటున్నానని, అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యేలతో చెప్పినట్టు తెలుస్తోంది. ముందు సోనియా గాంధీని కలిసి తన అభిప్రాయాలు పంచుకుంటానని చెప్పారట. ఆ తరవాత కేరళకు వెళ్లి రాహుల్ గాంధీతో మాట్లాడతారట. అధ్యక్షుడిగా ఉండమని ఓ సారి ఆయనతో చెప్పి చూసి, ఆయన కాదంటే....అధ్యక్ష ఎన్నికల్లో నిలబడేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పినట్టు సమాచారం. 






నామినేషన్‌కు సిద్ధం..? 


అయితే...అశోక్ గెహ్లోట్ మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలంతా కలిసి అడిగితే రాహుల్ మనసు మార్చుకుంటారన్న నమ్మకం ఉందని చెప్పారట. అంటే...రాహుల్‌ను కన్విన్స్‌ చేసే ప్రయత్నాల్లోనూ ఉన్నారు గెహ్లోట్. ఏదేంటని నిర్ణయం తీసుకున్నాక ఢిల్లీకి వెళ్లి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయనున్నారు. ఈ మీటింగ్‌ సారాంశాన్ని రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ మీడియాకు వెల్లడించారు. "నేను ఒకవేళ నామినేషన్ వేస్తే మీ అందరికీ సమాచారం ఇస్తాను. ఢిల్లీకి వచ్చేయండి" అని సీఎం చెప్పారని మంత్రి వెల్లడించారు. అంతే కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. ఈ నెల 24వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 30 వ తేదీన ముగుస్తుంది. అధ్యక్ష పదవికి పోటీ చేసే వారిలో కీలక అభ్యర్థిగా ఉన్నారు గెహ్లోట్. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తే ఉంటున్నారు. ఇప్పుడు గెహ్లోట్‌కు ఈ పదవి దక్కితే...20 ఏళ్ల తరవాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ కుర్చీలో కూర్చున్నట్టు అవుతుంది.  


 Also Read: RRR For Oscars : ముందుంది అసలైన యుద్ధం - రంగంలోకి దిగిన 'ఆర్ఆర్ఆర్' టీమ్