Congress President Election:
పరిష్కరించాల్సిన సమస్యలెన్నో..
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. ఆ తరవాత ABP Newsకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలు ప్రస్తావించారపు. పార్టీ కార్యకలపాలాన్నీ ఢిల్లీకి మాత్రమే కేంద్రీకృతం కావటం వల్లే ఇన్నిసమస్యలు వస్తున్నాయని కుండ బద్దలు కొట్టేశారు. కాంగ్రెస్‌లో అధికారం "ఇన్వర్టెడ్ పిరమిడ్"ను తలపిస్తోందని వ్యాఖ్యానించారు. అందరికీ అధికారం అనే కాన్సెప్ట్ కాకుండా...కేవలం ఢిల్లీలోని అధిష్ఠానం చేతిలోనే అధికారం ఉండాలన్న ఆలోచనే కాంగ్రెస్‌కు చేటు చేస్తోందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లో "High Command" అనే కాన్సెప్ట్ ఎన్నో ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చిందని, అది బాగానే వర్కౌట్ అయిందని అన్నారు. అయితే... ఇప్పుడు ఈ విధానానికీ స్వస్తి పలకాల్సిన సమయం వచ్చందని స్పష్టం చేశారు. "హై కమాండ్ అనే కాన్సెప్ట్‌కీ ఎక్స్‌పైరీ డేట్ దగ్గరపడిందని అనుకుంటున్నాను. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్, జ్యోతిరాదిత్య సిందియా, ఆర్‌పీఎన్ సింగ్ లాంటి సీనియర్ నేతలంతా ఇప్పటికే పార్టీని వీడారు. అంత మంది అసంతృప్తితో ఉన్నప్పుడు, పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నప్పుడు కొత్త విధానాలు అనుసరించాల్సిన అవసరం ఉంది" అని వెల్లడించారు శశి థరూర్.
ఇక పార్టీని ఎలా గాడిన పెడతారన్న ప్రశ్నకూ సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌లో అధికార వికేంద్రీకరణ చేపట్టాల్సిన అవసరముందని చెప్పారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించాలని అన్నారు. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు కార్యకర్తలతో మాట్లాడి...వాళ్ల అభిప్రాయాల్ని గౌరవించాలని సూచించారు. "ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు పార్టీ నేతలతోనూ చర్చించాలి. ఏడాదిలో అప్పుడప్పుడూ ఓ సారి సమావేశం అవటం కాకుండా నెలకోసారి వర్కింగ్ కమిటీ మీటింగ్‌లు ఏర్పాటు చేయాలి" అని చెప్పారు.
సంస్కరణలు అవసరం..
కాంగ్రెస్‌ను కుదిపేసిన G-23 పైనా శశి థరూర్ స్పందించారు. అలాంటి సంస్థే లేదని తేల్చి చెప్పారు. "కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో సీనియర్ నేతలంతా సోనియా గాంధీకి లేఖ రాశారు. ఢిల్లీలో ఉన్న వాళ్లంతా ఆ లెటర్‌పై సంతకం చేశారు. ఆ సమయంలో 23 మంది మాత్రమే ఢిల్లీలో ఉన్నారు కాబట్టి వాళ్లు సైన్ చేశారు. ఇంకా ఎక్కువ మంది ఉండుంటే G-23 అనే పేరు రాకపోయేది. అంత కన్నా ఎక్కువ మందే ఉండే వారేమో" అని స్పష్టం చేశారు. ఆ లెటర్‌లో సంతకం చేసిన వాళ్లలో చాలా మంది నేతలు రాజీనామా చేశారని గుర్తు చేశారు. "నేను ఎన్నోసార్లు కాంగ్రెస్ హైకమాండ్‌కు సూచనలు చేశాను. పార్టీలో సంస్కరణలు అవసరమనీ చెప్పాను. G-23 లేఖ రాకముందే నేను అదంతా చర్చించాను" అని చెప్పారు థరూర్. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్ నామినేషన్ దాఖలు చేశారు. దిగ్విజయ్ సింగ్ కూడా రేసులో ఉన్నప్పటికీ..చివరి నిముషంలో ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు థరూర్ వర్సెస్ ఖర్గేగా మారింది ఈ పోరు.
Also Read: ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!