Congress President Election: 'నా వెనుక సోనియా గాంధీ లేరు- అందుకే బరిలోకి దిగాను'

ABP Desam   |  Murali Krishna   |  12 Oct 2022 12:34 PM (IST)

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ సోనియా గాంధీ మద్దతు ఇవ్వడం లేదని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

(Image Source: PTI)

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తనకు సోనియా గాంధీ మద్దతిస్తున్నారని వచ్చిన వార్తలను మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్ష పదవికి తన పేరును సూచించలేదని ఖర్గే అన్నారు.

సోనియా గాంధీ నా పేరును అధ్యక్ష పదవికి సూచించారనే వార్తలు అవాస్తవం. నేనెప్పుడూ ఈ మాట అనలేదు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనరని లేదా ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వరని సోనియా గాంధీ స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని, నన్ను కించపరిచేందుకే ఎవరో ఈ పుకారు పుట్టించారు.                             - మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి 

అందుకే

ప్రస్తుతం దేశ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని అందుకే కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఖర్గే ఆకాంక్షించారు.

దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అందుకే నేను పోరాడాలనుకుంటున్నాను. ప్రజాస్వామ్యానికి చోటు లేకుండా మోదీ, షా రాజకీయాలు చేస్తున్నారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. వీరిపై పోరాడాలంటే నాకు అధికారం కావాలి. అందుకే పార్టీ సభ్యుల సూచన మేరకు నేను అధ్యక్ష ఎన్నికల్లో పోరాడుతున్నాను.                         - మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి 

ఖర్గే అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ నాయకులు అశోక్ గహ్లోత్, దిగ్విజయ సింగ్, ప్రమోద్ తివారీ, పీఎల్ పునియా, ఎకె ఆంటోనీ, పవన్ కుమార్ బన్సాల్, ముకుల్ వాస్నిక్ వంటి సీనియర్ నేతలు ప్రతిపాదించారు. జీ 23 నాయకులు ఆనంద్ శర్మ, మనీష్ తివారీ మద్దతు ఇచ్చారు.

థరూర్

అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గేకు పోటీగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ నామినేషన్ దాఖలు చేశారు. తాను ఎవరికీ పోటీగా బరిలోకి దిగలేదని పార్టీపై ప్రేమతోనే ఇది చేస్తున్నట్లు శశి థరూర్ అన్నారు.

" పార్టీ అధికారికంగా ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించలేదు. గాంధీ కుటుంబం ఈ రేసులో తటస్థంగా ఉంటుందని, వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థులను తాము స్వాగతిస్తామని కాంగ్రెస్ అధినేత్రి నాకు హామీ ఇచ్చారు. ఆ స్ఫూర్తితోనే నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇది ఎవరినీ అగౌరవపరచడం కాదు. స్నేహపూర్వక పోటీ. మేము ప్రత్యర్థులం కాదు. మేం ఎన్నో ఏళ్లుగా కలిసి పని చేసిన నేతలం. మల్లికార్జున్ ఖర్గే మా పార్టీకి 'భీష్మ పితామహుడు'. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో పార్టీ కార్యకర్తలు నిర్ణయించుకోనివ్వండి. ఖర్గే గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడను.                                                        "-శశి థరూర్, కాంగ్రెస్ నేత

Also Read: Bharat Jodo Yatra: రోడ్డుపై రాహుల్ గాంధీ పుష్‌ అప్ ఛాలెంజ్- ఉత్సాహంగా జోడో యాత్ర!

Also Read: Bihar Accident: పోలీసు బస్సు కింద ఇరుక్కున్న బైక్- ముగ్గురు సజీవదహనం!

Published at: 12 Oct 2022 12:19 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.