Congress On Shashi Tharoor: శశిథరూర్‌పై కాంగ్రెస్ ఫైర్- రిగ్గింగ్ ఆరోపణలకు కౌంటర్!

ABP Desam   |  Murali Krishna   |  20 Oct 2022 05:45 PM (IST)

Congress On Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన శశిథరూర్‌పై పార్టీ నేతలు ఫైర్ అయ్యారు.

శశిథరూర్‌పై కాంగ్రెస్ ఫైర్- రిగ్గింగ్ ఆరోపణలకు కౌంటర్!

Congress On Shashi Tharoor: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గేతో పోటీ పడి శశిథరూర్ ఓడిపోయారు. అయితే ఓటమి అనంతరం ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు శశి థరూర్‌ వర్గం ఆరోపణలు చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు ముఖాలు

ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే శశి థరూర్‌ ఆరోపణలకు మిస్త్రీ కౌంటర్‌ ఇచ్చారు. శశిథరూర్‌కు రెండు ముఖాలు ఉన్నాయన్నారు.

మేము మీ అభ్యర్థనను స్వీకరించాం. కానీ మీరు మీడియా ముందుకు వెళ్లి కేంద్ర ఎన్నికల అథారిటీ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నినట్లు ఆరోపించారు. మా సమాధానాలన్నిటితో మీరు సంతృప్తి చెందారని మాకు తెలియజేశారు. అప్పుడు మా ముందు మీకు ఒక ముఖం ఉంది. మాపై ఈ ఆరోపణలన్నీ చేసిన మీడియాలో మేం వేరే ముఖం చూశాం. ఇది చెప్పడానికి నేను చింతిస్తున్నాను.                  -     మధుసూదన్‌ మిస్త్రీ,  కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ 

సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో అక్రమాలు జరిగాయంటూ శశిథరూర్‌ సంచలన ఆరోపణలు చేశారు. పోలింగ్ నిబంధనలు ఉల్లంఘించి...రిగ్గింగ్‌కు పాల్పడ్డారని అన్నారు. ముఖ్యంగా యూపీలో ఎన్నో అవకతవకలు జరిగాయని థరూర్‌ వర్గం ఆరోపిస్తోంది. ఈ మేరకు వాళ్లు...కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీకి బుధవారం లేఖ రాసింది.

నిజానికి మేం లేఖ రాయాలని అనుకోలేదు. ఎన్నికలో అవకతవకలు జరుగుతున్నాయని ఇప్పటికే ఎన్నో సార్లు ఫిర్యాదు చేశాం. కానీ...కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదు. అందుకే...లేఖ రాశాం. యూపీలో పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగలేదు. ఖర్గే మద్దతుదారులు దగ్గరుండి మరీ ఈ అవకతవకలకు పాల్పడ్డారు. బహుశా..ఈ విషయం ఖర్గేకి తెలిసి ఉండకపోవచ్చు. కొన్ని బ్యాలెట్ బాక్స్‌లకు సీల్‌ వేయలేదు. ఇది న్యాయమా..? అందుకే ఆ రాష్ట్రంలో పోలైన ఓట్లను చెల్లనివిగా పరిగణించాలి. -                      శశిథరూర్ వర్గం
 

ఖర్గే గెలుపు

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో ఎక్కువ మంది కాంగ్రెస్‌ శ్రేణులు ఖర్గేకు ఓటు వేశారు. పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌ పోటీ పడ్డారు. ఇవాళ (అక్టోబర్ 19న) ఫలితాలు వెలువడ్డాయి. దీంతో 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టననున్నారు.

ఎన్నికల్లో ఖర్గేకు అనుకూలంగా చాలా మంది తమ ఓటు వేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌లో జరిగిన ఎన్నికల్లో 7897 మంది ఖర్గేకు అనుకూలంగా ఓట్లు వేశారు. 1072 మంది శశిథరూర్‌కు అనుకూలంగా ఓటు వేశారు. అంటే 6800పైగా మెజారిటీతో  ఖర్గే విజయం సాధించారు. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. 

Also Read: NCP Leader Supriya Sule: ట్రాఫిక్ పోలీస్‌గా మారిన పవార్ కుమార్తె- వీడియో చూశారా?

Published at: 20 Oct 2022 05:24 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.