దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంగా దూసుకుపోతున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు బండి బయటకి తీయాలంటే భయపడుతున్నారు. మార్చి 22 నుంచి ఇప్పటివరకు ఇంధన ధరలు 14 సార్లు పెరిగాయి. ఈ 16 రోజుల్లో పెట్రోల్, డీజిల్‌పై రూ. 10 పెరిగాయి.
పెట్రోల్ 120
పెట్రోల్ ధర సెంచరీ మార్కు దాటితేనే లబోదిబోమన్న ప్రజలు ఇప్పుడు అంతకుమించి చూస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.120కి చేరుకుంది. డీజిల్ సెంచరీ దాటింది. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
ఎన్నికలైన వెంటనే
మార్చి 22కు ముందు 137 రోజుల పాటు దశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రో బాదుడు మొదలైంది. ఎక్కడా ఆగకుండా ప్రతిరోజూ పెంచుతూనే ఉన్నారు. దీంతో 15 రోజుల్లోనే రూ.10 పెంచేశారు.
అయినా కేంద్రం పెట్రో ధరల పెంపును సమర్థించుకుంటోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు స్వల్పంగానే పెరిగాయని కేంద్ర పెట్రోలియం శాఖ చెబుతోంది.
ఎందుకు?
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. ఏప్రిల్ 6 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 101.60 డాలర్ల గరిష్ఠ స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ ధర రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.
ముడి చమురు ధరలు ప్రస్తుతం 110 డాలర్ల మార్కును దాటాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు మరింత ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేశంలో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది.
Also Read: Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఆ పక్షమే- పార్లమెంటులో విదేశాంగ మంత్రి క్లారిటీ
Also Read: Viral Video: కూతురికి ఏం గ్రాండ్ వెల్‌కమ్ ఇచ్చావు కాకా! అట్లుంటది మనతోని!