Shashi Dharur likely to join BJP: కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ .. ఎగిరిపోయేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్లుగా ట్వట్లు పెడుతున్నారు. ఎగిరిపోవాలనుకుంటే ఎవరి పర్మిషన్ తీసుకోవద్దని.. రెక్కలు నీవి.. ఆకాశం అందరిది అని ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
శశి థరూర్ ఇటీవల ప్రధాని మోదీని పదే పదే ప్రశంసిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వైఖరికి విరుద్ధంగా ఉన్నాయి. గతంలో థరూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మద్దతుతో ఖర్గే పోటీ చేశారు కానీ.. పార్టీలో ఎవరి అనుమతి లేకుండా థరూర్ పోటీ చేశారు. కానీ ఆయనకు చాలా స్వల్ప ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి పార్టీతో గ్యాప్ కనిపిస్తోంది. రాహుల్ గాంధీ , ఇతర సీనియర్ నాయకులతో ఆయన సంబంధాలు తగ్గిపోయాయి.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత ప్రభుత్వం చేపట్టిన అంతర్జాతీయ దౌత్య కార్యక్రమంలో థరూర్‌ను ఒక బృందానికి నాయకుడిగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకుల పేర్లను సూచించినప్పటికీ, థరూర్‌ను కేంద్రం ఎంపిక చేసింది. ఇది వివాదాస్పదం అయింది. పార్టీ నామినేట్ చేయలేదు కాబట్టి ఆయన ప్రభుత్వ ఎంపికను తిరస్కరించాలని కాంగ్రెస్ నేతలు అనుకున్నారు. కానీ థరూర్ ఆ పని చేయలేదు. పార్టీ వైఖరికి విరుద్ధంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని కాంగ్రె్స అగ్రనేతలు భావిస్తున్నారు.
థరూర్ తరచూ కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కేరళలో CPI(M) ప్రభుత్వాన్ని ప్రశంసించడం, RSS చీఫ్ మోహన్ భాగవత్‌తో సమావేశం కావడం వంటివి ఆయన BJP వైపు మొగ్గుతున్నారనే ఊహాగానాలు పెరగడానికి కారణం అవుతున్నాయి. థరూర్ కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాలనే ఆకాంక్ష ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ హైకమాండ్ ఆయనకు ఈ అవకాశం ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని, ఇది ఆయన అసంతృప్తికి కారణమని చెుతున్నారు.
అయితే థరూర్ పలు సందర్భాలలో తాను BJPలో చేరే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆయన తనను తాను "క్లాసిక్ లిబరల్"గా పేర్కొంటూ వచ్చారు. ఆపరేషన్ సిందూర్ వంటి జాతీయ భద్రతా అంశాలలో తాను పార్టీ వైఖరిని పక్కనపెట్టి దేశహితం కోసం మాట్లాడుతున్నానని, ఇది BJPలో చేరడానికి సంకేతం కాదని థరూర్ అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనను దూరం పెట్టడంతో మరో చాయిస్ లేదని.. బీజేపీలో చేరుతారన్న ఊహాగనాలు వస్తున్నాయి.