Himachal Pradesh Political Crisis: హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కి పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేసింది కాంగ్రెస్. ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కింద (anti-defection law) వాళ్లపై ఈ చర్యలు తీసుకున్నట్టు కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ కుల్‌దీప్ సింగ్ పఠానియన్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు ఎప్పటికప్పుడు నాటకీయంగా మారిపోతున్నాయి. బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం దానికి ఆమోద ముద్ర వేసింది. అంతకు ముందు దాదాపు 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బహిష్కరించింది. సభలో అనవసరంగా గందరగోళం సృష్టిస్తున్నారని స్పీకర్ మండి పడ్డారు. ఇప్పుడు ఫిరాయింపుకి పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేశారు. 


"కాంగ్రెస్‌ గుర్తుతో పోటీ చేసి గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ప్రకారం నిందితులే. వీళ్లకు సభలో కొనసాగే అర్హత లేదని స్పష్టం చేస్తున్నాను. అందుకే వాళ్లపై అనర్హతా వేటు వేస్తున్నాను"


- కుల్‌దీప్ సింగ్ పఠానియన్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ 


ఏం జరిగింది..?


రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సింఘ్వీ పోటీ చేశారు. బీజేపీ తరపున హర్ష్ మహాజన్ బరిలోకి దిగారు. అయితే...ఈ ఓటింగ్ జరిగిన సమయంలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారు. ఫలితంగా బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌ గెలుపొందారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఓటింగ్ పూర్తైన వెంటనే హరియాణాకి వెళ్లిపోయారు. ఆ తరవాత బీజేపీ నేతలు అసెంబ్లీలో సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ని కోరారు. ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయడం వల్ల కాంగ్రెస్ బలం 40 నుంచి 34కి పడిపోయింది. ఫలితంగా...అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజీనామా చేసినట్టు పుకార్లు వచ్చాయి. దీనిపై ఆయన వెంటనే స్పష్టతనిచ్చారు. తాను రాజీనామా చేయలేదని, ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వం కొనసాగుతుందని వెల్లడించారు. 


హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 35 సీట్లలో విజయం సాధిస్తే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. 2022లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 40 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 25 సీట్లకు పరిమితమైంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్‌ బలం మొత్తం 43కి చేరుకుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల్ని పరిశీలిస్తే...ఒకవేళ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తమ మద్దతుని ఉపసంహరించుకుంటే కాంగ్రెస్‌ బలం 34కి పడిపోతుంది. అంటే...మ్యాజిక్ ఫిగర్‌ కోల్పోతుంది. అంటే ప్రభుత్వం కూలిపోతుంది. అయితే...అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు సరిగ్గా జరగవని, ఈలోగానే ప్రభుత్వం కూలిపోతుందని కొంతమంది వాదించారు. కానీ...బడ్జెట్‌ని ప్రవేశపెట్టడమే కాకుండా దానికి ఆమోదం కూడా తెలిపింది సుఖ్వీందర్ సింగ్ సర్కార్. అంతే కాదు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న బీజేపీ కుట్ర పని చేయలేదని సుఖ్వీందర్ తేల్చి చెప్పారు. 


Also Read: మీరు పంపేయాలనుకుంటే వెళ్లిపోతా, అదంతా మీడియా సృష్టి - కమల్ నాథ్ కీలక వ్యాఖ్యలు