Rahul Gandhi: అల్లర్లతో అట్టుడుకుతున్న ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ ప్రాంతాన్ని కాంగ్రెస్ ఎంపీల బృందం త్వరలో సందర్శించనుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ బృందానికి నాయకత్వం వహించనున్నారు. ఐదుగురు ఎంపీలు కూఢా ఈ టీమ్ లో ఉండనున్నారు. అయితే తాజాగా కేరళలోని వయనాడ్ ఎంపీగా ఎన్నికైనా ప్రియాంకా గాంధీ వాద్ర కూడా ఈ బృందంతోపాటు సంభాల్ లో పర్యటించనున్నట్లు యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ తెలిపారు. 


కోర్టు ఆదేశాలతో అల్లర్లు.. 
మొఘల్ కాలానికి చెందిన జామా షాహి మసీదులో సర్వే జరపాలని స్థానిక కోర్టు ఆదేశాలివ్వడంతో ఈ అల్లర్లు మొదలయ్యాయి. నిజానికి ఈ మసీదు.. హరిహర టెంపుల్ అని స్థానికంగా ఒక వర్గానికి చెందిన నేతలు వాదిస్తున్నారు. తమకు చెందిన ఆలయ పునాదులపై మసీదును నిర్మించారని, దీనిపై విచారణ జరగాలని చాలా కాలంగా డిమాండ్లు వెల్లువెత్తాయి.  దీనిపై కొంతమంది కోర్టును ఆశ్రయించగా, సర్వే చేపట్టాలని నవంబర్ 18న ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత రెండో దశ సర్వే కోసం నవంబర్ 24న ఆదేశాలివ్వగా.. అప్పటి నుంచి అక్కడ కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో అక్కడ ప్రస్తుతం కర్ఫ్యూ విధించారు. అయితే భారత న్యాయ సురక్ష సంహిత కింద ఈ కర్ఫ్యూని ఈనెల 31 వరకి పోడగించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ అల్లర్ల కారణంగా నలుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. 


కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు..
మరోవైపు అల్లర్లతో అట్టుడుకుతున్న ప్రాంతాన్ని సందర్శించాలని భావించిన యూపీ చీఫ్ అజయ్ రాయ్ బృందాన్ని లక్నోలోని కాంగ్రెస్ కార్యాలయ ఆవరణలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ తర్వాత సంభాల్ ప్రాంతంలోకి తమను అనుమతించాలంటూ కాంగ్రెస్ శ్రేణులు ధర్నా కూడా చేశాయి.  సంభాల్ ప్రాంతాన్ని సందర్శించకుండా తమను అడ్డుకోవడం ప్రజస్వామ్యాన్ని అణిచివేయడమేనని కాంగ్రెస్ నేతలు వాదించారు. ప్రస్తుత అల్లర్ల వెనుక బీజేపీ హస్తం ఉందని, ఏదో ఆశించి ఈ అల్లర్లను మొదలు పెట్టారని అంటున్నారు. తాము పర్యటించి బీజేపీ ఎత్తుగడలను బహిర్గతం చేస్తామనే భయంతోనే తమను అడ్డుకుంటున్నారని విమర్శించారు. పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ ఇలాంటి ఎత్తుగడలకు దిగిందని ఆరోపించారు. 
అంతకుముందు నిజనిర్ధారణ కోసం సంబాల్ ప్రాంతాన్ని సందర్శించాలని భావించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అల్లర్లపై కోర్టుకు చెందిన న్యాయ నిపుణుల టీమ్ విచారణ చేస్తోంది. 



డిసెంబర్ 10 వరకు కర్ఫ్యూ..
పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు ఈనెల 10 వరకు కర్ఫ్యూ విధించారని, దాన్ని సడలించిన తర్వాత మళ్లీ సందర్శిస్తామని రాయ్ పేర్కొన్నారు. ఈ  నేపథ్యంలో రాహుల్ గాంధీతో కూడిన ఎంపీల బృందం సంభాల్ ప్రాంతాన్ని పర్యటించాలని భావిస్తోంది.
 మరోవైపు దీన్ని పబ్లిసిటీ స్టంట్ గా బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. శాంతియుత వాతావరణం నెలకొంటున్న క్రమంలో కాంగ్రెస్ నేతలు అక్కడ పర్యటించడం సరికాదని యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య విమర్శించారు. మరోవైపు లా అండ్ అర్ఢర్ కు ఎలాంటి భంగం కలిగించే పనులు చేసిన చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.