Andhra Pradesh cabinet Decisions | అమరావతి: వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మొదలైన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపుగా రెండున్నర గంటల పాటు ఏపీ మంత్రివర్గం సమావేశం కొనసాగింది. కాకినాడ పోర్టు, గౌతమ్ అదానీ వ్యవహారంపై భేటీలో మంత్రివర్గం కీలకంగా చర్చించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 


సమీకృత పర్యాటక పాలసీ 2024-29తో పాటు 2024 నుంచి 2029 స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం ఆవాస్‌ యోజన గిరిజిన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ మారిటైమ్‌ పాలసీకి,  ఏపీ టెక్స్‌టైల్స్‌ గార్మెంట్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఐటీ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ పాలసీ 4.0కు, పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని డిసెంబరు 15ను ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించడానికి ఆమోదం తెలిపారు. ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్‌ రిజిస్ట్రేషన్‌ చట్ట సవరణకు సైతం చంద్రబాబు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.




ఏపీ కేబినెట్‌లో అదానీ పవర్‌పై కీలక చర్చ


ఏపీ మంత్రివర్గ సమావేశంలో అదానీ పవర్ వ్యవహారంపై కీలకంగా చర్చ జరిగింది. వైసీపీ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో సెకీతో ఒప్పందంపై ఇటీవల ఆరోపణలు రావడం తెలిసిందే. సెకీ ఒప్పందంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు. అదానీ పవర్‌పై నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్‌ని పెండింగ్‌లో పెట్టాలని మంత్రివర్గం భావిస్తోంది. అదానీతో గత ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం కారణంగా రూ. 1750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏపీ కేబినెట్‌లో ఈ విషయాలను సహచర మంత్రులకు చంద్రబాబు వివరించారు. విద్యుత్ ధరలు తగ్గించకపోతే ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.పెనాల్టీ చెల్లించడమే ఉత్తమమని మంత్రివర్గం భావిస్తోంది. అదానీతో విద్యుత్ ఒప్పందం రద్దు చేసుకుంటే రూ. 2100 కోట్లు పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుందని కీలకంగా చర్చించారు.