Congress 139th Foundation Day Nagpur Meeting: కాంగ్రెస్ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల కోసం రణభేరి మోగించింది. ‘ఎన్నికలకు మేం రెడీగా ఉన్నాం’ అని నాగ్ పుర్ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు (డిసెంబర్ 28) ఆర్‌ఎస్‌ఎస్ కంచుకోట అయిన నాగ్‌పుర్‌లో (Nagpur) కాంగ్రెస్ భారీ ర్యాలీ (Congress Rally), బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో మాట్లాడిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ బీజేపీ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చాలా మంది బీజేపీ ఎంపీలు తమను కలుస్తున్నారని.. తమ బాధను చెప్పుకుంటున్నారని అన్నారు.


బీజేపీలో బానిసత్వం - రాహుల్ గాంధీ


రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘బీజేపీలో బానిసత్వం సాగుతోందని ఓ బీజేపీ నేత నాతో చెప్పారు. మా మాట ఎవరూ వినరు, కాంగ్రెస్ లో అయితే, ఎవరైనా సీనియర్ నాయకుడితో తన అభిప్రాయాలను పంచుకోవచ్చు. దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు మన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి కాంగ్రెస్ లో మనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఆ బీజేపీ నేత నాతో అన్నారు’’ అని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.




కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం


కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. ఏ కాంగ్రెస్ నాయకుడైనా కార్యకర్తలు అయినా నాతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్పేది నాకు నచ్చకపోతే, నేను కచ్చితంగా వారితో ఏకీభవించను. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల గొంతులను మేం అణచివేయము.


దేశంలో రెండు సిద్ధాంతాల పోరు


దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరు నడుస్తోంది. ఇది రాజకీయం కాదు, అధికారం కోసం పోరాటం. ప్రజలు న్యాయం, అన్యాయం మధ్య ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యానికి బదులుగా, రాజుల మాదిరిగా ఆదేశాలు ఇచ్చే సంప్రదాయం దేశంలో ఉంది.


ప్రశ్నలు అడిగిన తర్వాత పటోలేను తోసేశారు


రాహుల్ గాంధీ మాట్లాడుతూ, 'మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే జీఎస్టీపై ప్రధాని మోదీని ఒక ప్రశ్న అడిగారు. ఆ తర్వాత పటోలే ఔటయ్యారు. ఇది అతని వేదన. ప్రశ్నలు అడిగే ఏ నాయకుడూ బీజేపీ అధిష్ఠానానికి నచ్చరు. ఎవరి సలహాలు మోదీకి నచ్చవు. వారికి అవును అని మాత్రమే చెప్పే వ్యక్తులను మాత్రమే మోదీ, అమిత్ షా ఇష్టపడతారు. నోరెత్తే వారికి బీజేపీలో స్థానం లేదు’’ అని రాహుల్ గాంధీ మాట్లాడారు.