Congress Protest:
17 పార్టీల నేతలు సమావేశం..
రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసిన తరవాత విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. కాంగ్రెస్‌తో సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలు కూడా బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈ నిర్ణయం సరికాదని గట్టిగానే వాదిస్తున్నాయి. ఇప్పుడీ పరిస్థితులనే కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. విపక్షాల మధ్య మైత్రి పెంచాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని పార్టీలు విభేదాలన్నీ పక్కన పెట్టి కాంగ్రెస్‌తో చేయి కలుపుతున్నాయి. రాహుల్ అనర్హతా వేటుపై పార్లమెంట్‌లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి..? బీజేపీతో ఎలా పోరాడాలి..? అనే అంశాలపై కాంగ్రెస్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో డీఎమ్‌కే, ఎస్‌పీ, జేడీయూ, బీఆర్‌ఎస్, సీపీఎమ్ సహా మొత్తం 17 పార్టీలు కాంగ్రెస్‌కు అండగా నిలిచాయి. అన్నింటికన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మీటింగ్‌కు తృణమూల్ కాంగ్రెస్ నేతలూ హాజరవడం. మొదటి నుంచి బీజేపీ, కాంగ్రెస్‌కు దూరంగా ఉంటోంది TMC.ప్రతిపక్షాల వ్యూహాలపై జరిగిన కీలక సమావేశంలో తృణమూల్ నేతలు హాజరవడం ఆసక్తికరంగా మారింది. ఎవరి ఐడియాలజీ వారిదే అయినప్పటికీ...ఈ సమయంలో అన్ని పార్టీలు ఏకం అవడం చాలా ముఖ్యం అని, బీజేపీపై పోరాడడానికి ఇదే మంచి తరుణం అని చెబుతోంది కాంగ్రెస్. అంతే కాదు. బీజేపీపై నిరసిస్తూ నల్ల దుస్తులు ధరించి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ ఎంపీలు. పార్లమెంట్ సమావేశాలకూ అవే దుస్తులతో హాజరయ్యారు. అయితే సభలు మొదలైన కాసేపటికే వాయిదా పడ్డాయి. ఆ తరవాత పార్లమెంట్ భవనంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆందోళనలు చేసింది.
టీఎమ్‌సీ, కాంగ్రెస్ మైత్రి..?
నిజానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అందుకే రాహుల్‌పై అనర్హతా వేటు వేసిన తరవాత వెంటనే స్పందించలేదు ఆ పార్టీ. అప్పటికే విపక్షాలన్నీ ఒక్కటైనప్పటికీ టీఎమ్‌సీ మాత్రం దూరంగానే ఉంది. గతంలో ఇదే తరహా మీటింగ్ జరిగినప్పుడు తృణమూల్ నేతలు హాజరు కాలేదు. అంతే కాదు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు బీజేపీతో రహస్యంగా కుమ్మక్కయ్యాయనీ గతంలో విమర్శించారు మమతా బెనర్జీ. ఇప్పుడు బీజేపీపై పూర్తి స్థాయి పోరాటం మొదలు పెట్టిన కాంగ్రెస్‌పై TMCకి కాస్త నమ్మకం ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. దీనిపై మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకునే ఏ పార్టీకైనా ఆహ్వానం పలుకుతామని స్పష్టం చేశారు.
Also Read: Rajasthan News: పానీపూరీలు అమ్ముకుంటున్న డాక్టర్, టీకొట్టులో పని చేస్తున్న సిబ్బంది, ఎందుకంటే?