Rajasthan News: ఓ ప్రైవేటు మహిళా వైద్యురాలు రోడ్డు పక్కన పానీ పూరీలు అమ్ముకుంటోంది. ఆ పక్కనే వైద్య సిబ్బంది టీకొట్టులో పని చేస్తున్నారు. ఇలా రోడ్డుపై చాలా మంది ప్రైవేటు వైద్యులు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ కనిపించారు. అయితే వీరంతా ఇలా ఎందుకు చేస్తున్నారే అనుమానం వస్తోందా.. దీని వెనుక ఓ పెద్ద కథే ఉందండి. 


అసలేం జరిగిందంటే..?


రాజస్థాన్ లోని ప్రైవేటు ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సికార్ జిల్లాకు చెందిన ఓ లేడీ డాక్టర్ ఆస్పత్రికి తాళం వేసి మరీ ఇలా పానీ పూరీలు అమ్ముకుటుంది. అలాగే అక్కడే ఉన్న మిగతా వైద్యులంతా ఆస్పత్రులను మూసేసి మరీ టీ, ఎగ్స్, పండ్లు అమ్ముకుంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఆ స్టాల్స్ పై ఏర్పాటు చేసిన బోర్డుపై ప్రైవేటు వైద్యులమని రాసి ఉంటుంది. అయితే ఆస్పత్రి యాజమాన్యం కూడా ఇలాగే చేస్తూ తమ నిరసనను తెలుపుతున్నారు. నిజానికి అక్కడ రాజస్థాన్ ప్రభుత్వం రైట్ టు హెల్త్ అనే బిల్లు తీసుకు వచ్చింది. ఈ బిల్లు ప్రకారం ప్రతి పౌరుడు ఎలాంటి చార్జీలు లేకుండా ఎక్కడైనా అత్యవసర వైద్యం పొందొచ్చు. దీన్ని రాజస్థాన్ లోని ప్రైవేటు వైద్యులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు వైద్యుల బృందం ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని డిమాండ్ చేస్తూ విబిన్నంగా ర్యాలీలు చేపట్టారు. 


ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం


ఈ చట్టం పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సోమవారం రాజస్థాన్ లోని మొత్తం వైద్య సదుపాయాలను మూసేసి ఇలాంటి నిరసనలు పెద్ద ఎత్తున చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈనెల 29వ తేదీన దేశంలోని కొన్ని రాష్ట్రాల నుంచి వైద్యుల బృందాలు ఈ నిరసన కోసం రాజస్థాన్ కు వస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రే తనను కలవాలని వైద్యులకు చెప్పినప్పటికీ డాక్టర్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. అలాగే ఆదివారం మీడియా ద్వారా ప్రభుత్వం వైద్యులందరినీ విధుల్లోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేసినా.. అందుకు కూడా వైద్యులు స్పందించ లేదు. దీంతో ప్రభుత్వం ఈ నిరసనలను అణిచి వేసేందుకు సన్నాహాలు పార్రంభించినట్లు అధికారిక వర్గాల సమాచారం.  




అయితే గత వారం పది రోజులుగా రాజస్థాన్ లోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. రైట్ టు హెల్త్ బిల్లు వల్ల ఆస్పత్రులు, క్లినిక్‌లు మరియు లేబొరేటరీల నుండి ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలను పొందే హక్కును రాష్ట్ర ప్రజలకు కల్పించాలని సర్కారు కోరుతోంది. ఇందులో ప్రైవేట్ సంస్థలు కూడా ఉంటాయి. ఈ క్రంలోనే రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు, వైద్యులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు.