Haryana Floor Test: హరియాణా కొత్త ముఖ్యమంత్రి నయాబ్ సైనీ ప్రభుత్వం అసెంబ్లీలో బల పరీక్షలో విజయం సాధించింది. బీజేపీకి మెజార్టీ ఉందని నిరూపించుకున్నారు సీఎం. అంతకు ముందు జననాయక్ జనతా పార్టీ (JJP)తో తెగదెంపులు చేసుకున్న బీజేపీ నయాబ్ సైనీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదంతా కేవలం 48 గంటల్లో జరిగిపోయింది. బీజేపీ-జేజేపీ కూటమిలో విభేదాలు తలెత్తడం వల్ల విడిపోవాల్సి వచ్చింది. 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి సంకీర్ణ ప్రభుత్వమే ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నట్టుండి రాజీనామా చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తరవాత రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. వెంటనే నయాబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమకు 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ బండారు దత్తాత్రేయకి లేఖ పంపారు. లోక్‌సభ ఎన్నికల సీట్‌ల పంపకాల విషయంలో బీజేపీ, జేజేపీ మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. అందుకే...ఉన్నట్టుండి ఈ కూటమి చీలిపోయింది.
జేజేపీ అధినేత దుశ్యంత్ చౌతాలా 10 మంది ఎమ్మెల్యేలపై విప్ జారీ చేశారు. అంతే కాదు. బలపరీక్ష ఓటింగ్‌కి దూరంగా ఉండాలని ఆదేశించారు. అయినప్పటికీ నలుగురు ఎమ్మెల్యేలు విప్‌ని ఉల్లంఘించి అసెంబ్లీలోకి వచ్చారు. మొత్తం 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలున్నారు. వీళ్లతో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులూ నయాబ్ సింగ్ సర్కార్‌కి మద్దతు తెలిపారు. అటు హరియాణా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే కూడా బీజేపీకే మద్దతునిచ్చారు. JJP కి కేవలం పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.కాంగ్రెస్‌కి 30 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ముందు బీజేపీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఖట్టర్‌తో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు.