CM Jagan Key Comments on Collectors Review Meeting: నాలుగున్నరేళ్ల పాలనా కాలంలో ప్రతి పేదవాడి ఇంటికే సంక్షేమం అందేలా మార్పులు తెచ్చామని, వైసీపీ ప్రభుత్వం అంటే విశ్వసనీయతకు మారుపేరని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. తాడేపల్లిలోని (Tadepally) తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతో (Collectors Review meeting) ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సమీక్షించారు. అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. కొత్త ఏడాదిలో 4 నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని, జనవరి 3, ఫిబ్రవరిలో 1 ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యకమాలుంటాయని, అవి సక్రమంగా నడిచేలా షెడ్యూల్ చేసుకోవాలన్నారు.
జనవరి నుంచి రూ.3 వేల పెన్షన్
జనవరి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంచుతున్నట్లు సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరని చెప్పారు. 'గతంలో ఎన్నికలకు ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.2,250 చేశాం. దశలవారీగా రూ.3 వేలకు పెంచుకుంటూ వచ్చాం. పెన్షన్ల కోసం నెలకు రూ.1,950 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గతంలో 39 లక్షలుగా ఉన్న పెన్షన్ల సంఖ్య ఇప్పుడు 66 లక్షలకు చేరింది. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చాం. ఆదివారమైనా, పండుగైనా ఒకటో తేదీనే ఇంటి వద్దే పింఛన్ అందించేలా మార్పు తీసుకొచ్చాం. ఈ మార్పును ఎలా తెచ్చామో ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది.' అంటూ జగన్ పేర్కొన్నారు.
'విశ్వసనీయతకు మారుపేరు'
ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరని, ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా తాను జనవరి 3న కాకినాడలో పాల్గొంటున్నానని, అయితే అవ్వాతాతలు ఎదురు చూసే పరిస్థితే రాకుండా, జనవరి 1నే కార్యక్రమం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులంతా పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కార్యక్రమం నిర్వహించాలన్నారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ చేసుకోవాలని, 8 రోజులు పెన్షన్ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పెన్షన్ తో పాటు తన తరఫున లేఖ, తాను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలని వెల్లడించారు.
జనవరి 19న అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. జనవరి 23 నుంచి 31 వరకూ ఆసరా కార్యక్రమంలో జరుగుతుందని, ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ 'వైఎస్సార్ చేయూత' కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, అర్హత ఉండీ ఎవరైనా మిగిలిపోయిన సందర్భాల్లో అలాంటి వారికి పథకాలు వర్తింప చేసే బైయాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుందని వివరించారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు.