Chandrababu Naidu : 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. సమ్మిళిత వృద్ధితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో మన దేశం పేరు మార్మోగుతోందని తెలిపారు. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ (Union Budget) పైనా స్పందించిన చంద్రబాబు.. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులున్నాయని కొనియాడారు.
ఆ రంగంలో ప్రథమంగా సంస్కరణలు జరిగింది ఏపీలోనే
మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ఎంతో ప్రాధాన్యతనిస్తోందని, ఈ సారి బడ్జెట్ లో పన్ను సంస్కరణల్లోనూ చాలా మార్పులున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. విద్యుత్ రంగంలో ప్రథమంగా సంస్కరణలు జరిగింది ఏపీలోనేనని గుర్తు చేశారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయన్న ఆయన.. ఎంఎస్ఎంఈ పాలసీ గేమ్ ఛేంజర్ గా మారబోతోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాణిజ్యవేత్తల్లో అత్యధికంగా భారతీయులే ఉంటున్నారన్నారు.
బీజేపీకే ఓటు వేయాలి
ఢిల్లీ ఎన్నికలపై మాట్లాడిన ఏపీ సీఎం.. బీజేపీ(BJP)కి ఓటు వేయాలని, అప్పుడే అభివృద్ధి సాకారమవుతుందని చెప్పారు. ఢిల్లీ ఇప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయిందన్నారు. ఎక్కడ చూసినా సమస్యలేనని, ఎవరికి ఓటెస్తే డెవలప్మెంట్ జరుగుతోందో ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయాలు (Politics) కాలుష్యమయ్యాయన్నారు. పదేళ్ల ఆప్ పాలనలో ఢిల్లీలో అభివృద్ధి పూర్తిగా వెనకబడిందని ఆరోపించారు. అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటెయ్యాలని, బీజేపీ గెలుపే దేశ ప్రగతికి మలుపుని చెప్పారు.
బడ్జెట్ లో ఏపీకి నిధులు
ఇక పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఏపీ పేరు వినిపించలేదన్న విమర్శలపైనా సీఎం స్పందించారు. పేరు ప్రస్తావించనంత మాత్రానికి రాష్ట్రానికి నిధులు లేవని అర్థం కాదని, కొన్ని పథకాలకు ఎప్పటిలాగే నిధులు కేటాయించారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధ్వంస విధానాలతో రాష్ట్రం పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు. కావున రాష్ట్రానికి చేయూతనిచ్చి ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఇప్పుడిప్పుడే జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నిస్తూ.. అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నామన్నారు.
Also Read : Land Mafia in AP: ఏకంగా సీఎం భూమి కబ్జాకు యత్నం - చంద్రబాబు భూమిని కాజేయాలని ల్యాండ్ మాఫియా ప్లాన్