Andhra Pradesh Municipal Elections | హిందూపురం మున్సిపాలిటీని అధికార కూటమి పార్టీ టీడీపీ కైవసం చేసుకుంది. బాలయ్య కంచుకోట అయిన హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా రమేష్ ఎన్నికయ్యారు. రమేష్‌కు అనుకూలంగా 23 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి లక్ష్మీకి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. ఆరో వార్డు కౌన్సిలర్, టీడీపీ నేత సురేష్ ఛైర్మన్‌గా ఎన్నిక కావడంతో కూటమిలో జోష్ నెలకొంది. ఈ ఎన్నికల్లో పాల్గొన్న ఎంపీ పార్థసారథి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటు వేశారు. మరో ముగ్గురు సభ్యులు గైర్హాజరు అయినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించగానే జై బాలయ్య అంటూ కూటమి శ్రేణులు నినాదాలు చేశాయి.


నెల్లూరులో రిజల్ట్..
నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థి తహసీన్‌ ఎన్నికయ్యారు. 29 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. డిప్యూటీ మేయర్ కోసం జరిగిన ఎన్నికల్లో తహసీన్‌‌కు 41 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు వచ్చాయి. దాంతో 29 ఓట్ల మెజారిటీతో తహసీన్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.


ఏలూరులోనూ టీడీపీదే హవా
ఏలూరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ అభ్యర్థులు ఆ స్థానం సాధించారు. ఏలూరు మొదటి డిప్యూటీ మేయర్‌గా ఉమామహేశ్వరరావు ఏకగ్రీవం కాగా, రెండో డిప్యూటీ మేయర్‌గా దుర్గాభవాని సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి ఎన్నికపై అధికారి ప్రకటన చేయడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.