Land Mafia in AP : భూముల విలువ రోజురోజుకూ పెరుగుతుండడంతో కేటుగాళ్లు కూడా అందుకు తగ్గ ప్లాన్లతో నకిలీ పత్రాలు క్రియేట్ చేస్తున్నారు. కోట్లు సంపాదించేందుకు స్కెచ్ వేసి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు ఈ ల్యాండ్ మాఫియా ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి భూమిపైనే కన్నేసింది. ఆయనపై ఉన్న భూమి విలువ ఇప్పుడు కోట్లలో ఉండడంతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, రుణ కోసం బ్యాంకుకు వెళ్లడంతో అసలు బాగోతం బయటపడింది. దీంతో ఈ కేసులో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూముల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ల్యాండ్ కాజేసే యత్నం చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
ఏపీ సీఎం పేరు మీదున్న స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నం
బాపట్ల పట్టణం రైలుపేటకు చెందిన టీడీపీ అభిమాని మొవ్వ సుబ్బారావు అనే వ్యక్తి టీడీపీ కార్యాలయం కోసం 2000 సంవత్సరంలో అంటే సరిగ్గా 25ఏళ్ల కిందట 9.5 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. దాన్ని పార్టీ అధినేత చంద్రబాబు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ స్థలం బాపట్లలోని శ్రీనివాసనగర్ పరిధిలోని సర్వే నంబరు 969-1లో ఉంది. ఆ తర్వాత టీడీపీ అధికారంలో లేకపోవడంతో టీడీపీ పార్టీ స్థానిక నాయకత్వం కార్యాలయ నిర్మాణాన్ని అంతగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే వైసీపీ పాలనలో భూమాఫియా ఆగడాలకు నేతల దన్ను దొరకడంతో వారు రెచ్చిపోయారు. దీని విలువ ఇప్పుడు దాదాపు రూ.1.5 కోట్లకు చేరడంతో ఏకంగా చంద్రబాబు భూమిపైనే కబ్జాదారులు కన్నేశారు. ఖాళీగా ఉన్న స్థలాన్ని , నకిలీ డాక్యుమెంట్లతో వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మున్సిపాలిటీలో ఆ స్థలానికి పన్ను కూడా వేయించుకున్నారు.
2010లోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలోనూ చంద్రబాబు పేరుపై రిజిస్ట్రేషన్ అయిన స్థలంపై లావాదేవీలు జరిగినట్టు కూడా ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ విషయం బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ దృష్టికి ఈ విషయం రావడంతో వ్యవహారం బట్టబయలైంది. ఆయన ఫిర్యాదుతోనే సత్తార్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ భూ మాఫియా ముఠాలో సత్తార్‌రెడ్డితో పాటు చీరాల మండలం పాలిబోయినవారిపాలేనికి చెందిన ఇంకో వ్యక్తి కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు విచారణలో తేలింది.
నక్క సత్తార్ రెడ్డి ఎవరంటే..
నక్క సత్తార్ రెడ్డి బాపట్ల మండలం కొత్త ఓడరేవుకు చెందిన వ్యక్తి. ఆయన స్థలం విషయంలో నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించే చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆయన వల్లే ల్యాండ్ కబ్జా చేసేందుకు ప్రయత్నాలు సులభమయ్యాయని అంటున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన 2023లో దొంగ పత్రాలు సృష్టించి ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ ఆసరాగా నరసరావుపేటలో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించిన ఉదంతంతో దీనికి సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్టు సమాచారం. ఆ కేసులో నరసరావుపేట పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఏదేమైనా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దొంగ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితినే పూర్తి విషయాలు బయటకు వస్తాయిన పోలీసులు భావిస్తున్నారు.
Also Read : Tirupati News: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు- కార్పొరేటర్ల కిడ్నాప్‌తో ఉద్రిక్తత, అర్ధరాత్రి హైడ్రామా!