Kaamya Karthikeyan : కేవలం 17 ఏళ్ల వయస్సులోనే ఓ బాలిక ప్రపంచంలోనే ఏడు పర్వతాల ఎత్తైన శిఖరాలను అధిరోహించింది. అంటార్కిటికాలోని అతిపెద్ద పర్వతమైన విన్సన్ మాసిఫ్‌ను అధిరోహించి పర్వతాల ఎత్తైన శిఖరాలను అధిరోహించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా పేరు సాధించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆమె దక్షిణం వైపు నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె ఇప్పటికే గుర్తింపు పొందింది.
ముంబైలోని నేవీ చిల్డ్రన్స్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోన్న కామ్య కార్తికేయన్ అనే 17 ఏళ్ల విద్యార్థిని ఏడు పర్వతాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఇప్పటివరకు ఆమె ఆఫ్రికా (కిలిమంజారో పర్వతం), యూరప్ (మౌంట్ ఎల్బ్రస్), ఆస్ట్రేలియా (మౌంట్ కోస్కియుస్కో), దక్షిణ అమెరికా (మౌంట్ అకోన్‌కాగువా), ఉత్తర అమెరికా (మెట్ దెనాలి), ఆసియా (ఎవరెస్ట్ పర్వతం)లను జయించింది. తాజాగా అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్ అధిరోహణతో ఈ ఘనత దక్కించుకుంది.
చిలీ ప్రామాణిక కాలమానం ప్రకారం, కామ్య తన తండ్రి కమాండర్ ఎస్. కార్తికేయన్‌తో కలిసి డిసెంబర్ 24న సాయంత్రం 5:20 గంటలకు అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ శిఖరాన్ని చేరుకుంది. సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్‌ను పూర్తి చేసినట్లు భారత నావికాదళం - IANS తెలిపింది. ఈ మైలురాయిని సాధించినందుకు కామ్య కార్తికేయన్, ఆమె తండ్రిని భారత నౌకాదళం అభినందించింది. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం చేరుకోవడాన్ని తన తదుపరి లక్ష్యంగా కామ్య నిర్దేశించుకుంది.
ఈ విషయాన్ని నేవీ ప్రతినిధి Xలో పోస్ట్ చేశారు. ముంబైలో 12వ తరగతి చదువుతున్న కామ్య కార్తికేయన్, ఏడు పర్వతాల్లోని ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ ముఖ్యమైన మైలురాయిని సాధించినందుకు కామ్య కార్తికేయన్, ఆమె తండ్రిని భారత నావికాదళం అభినందిస్తోంది" అని పోస్ట్ చేశారు.
కామ్య రికార్డ్ పై ముంబైలోని నేవీ చిల్డ్రన్స్ స్కూల్ సైతం ఆమెకు అభినందనలు తెలియజేసింది. ఎన్నో అడ్డంకులను ఛేదించి శిఖరాలను అధిగమించిందని కొనియాడింది. ఈ విషయంలోనే ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన మహిళగా అవతరించింది. ఇది ముంబైకి గర్వకారణమని చెప్పింది.
7ఏళ్ల వయసులోనే ట్రెక్కింగ్
కామ్య ఏడేళ్ల వయసులోనే ట్రెక్కింగ్ ప్రారంభించింది. ఉత్తరాఖండ్‌లో ఆమె మొదటి ట్రెక్కింగ్ చేసింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినప్పుడు కామ్య కార్తికేయన్ వయస్సు పదహారేళ్లు. IANS ప్రకారం, ఆమె యువ సాధకులకు ఇచ్చే భారతదేశపు అత్యున్నత జాతీయ గౌరవమైన ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల శక్తి పురస్కారాన్ని 2021లో పొందింది. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్-కీ-బాత్‌లోనూ ఆమెను ప్రశంసించారు. ఇప్పుడు ఆమె ఎక్స్‌ప్లోరర్స్ గ్రాండ్ స్లామ్ కోసం ప్రయత్నిస్తోంది.