Systematic Withdrawal Plan Details: ఇప్పుడు, దేశంలో కోట్లాది మంది ఉద్యోగం లేదా వ్యాపారం వంటి వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్లంతా ఏదో ఒక రోజు వారి పని బాధ్యతల నుంచి పదవీ విరమణ (Retirement) చేయవలసిందే. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (Old Pension Scheme)లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, వారి రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. చివరి సంవత్సరం సగటు జీతంలో సగం డబ్బు రిటైర్ అయిన ఉద్యోగికి, అతను/ఆమె తర్వాత ఆ కుటుంబానికి అందుతుంది. అయితే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి రాని వాళ్లు లేదా ప్రైవేట్ ఉద్యోగులు లేదా వ్యాపారం నుంచి రిటైర్ అయ్యే వ్యక్తుల పరిస్థితి ఏంటి?. జీవితపు అవసరాలు తీరడానికి వాళ్లకు ప్రతి నెలా కొంత డబ్బు తప్పనిసరిగా అవసరం. ఇలాంటి వ్యక్తులకు మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) పథకం 'సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్' (SWP) చక్కగా ఉపయోగపడుతుంది. ఇది, నెలవారీ పింఛను (Monthly Pension) తరహాలో డబ్బును అందిస్తుంది.
'సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్' వివరాలు
మీరు సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్‌ను ఎంచుకుంటే, మ్యూచువల్ ఫండ్ నుంచి కొన్ని యూనిట్లను ముందే రిజర్వ్ చేసుకోవాలి. ఫండ్ మేనేజర్ వాటిని విక్రయించి ప్రతి నెలా మీ కోసం డబ్బును ఏర్పాటు చేస్తారు. మీ అవసరాన్ని బట్టి దీనిని 'రెగ్యులర్ క్యాష్ ఫ్లో'గా మీరు మార్చుకోవచ్చు. SWP నుంచి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం), అర్ధ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన కూడా డబ్బును తీసుకోవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటే భవిష్యత్తులో మీ పెట్టుబడి నుంచి మంచి రాబడిని పొందే అవకాశం కోల్పోతారు. కాబట్టి, పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసుకునే ఆలోచన చేయవద్దు.
SWP ద్వారా, రెగ్యులర్ కాల వ్యవధుల్లో డబ్బును ఉపసంహరించుకోవడం వల్ల స్టాక్ మార్కెట్ (Stock Market)తో పాటు మీ పెట్టుబడి కూడా పెరుగుతూనే ఉంటుంది, మీరు రాబడి (Returns) అందుకోవడం కొనసాగుతూనే ఉంటుంది, మీ ఆర్థిక అవసరాలు తీరతాయి. సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్, మీరు కొన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లను క్రమంగా రీడీమ్ చేస్తుంది. ఇవిపోను, మిగిలిన యూనిట్లతో కూడిన పోర్ట్‌ఫోలియో మార్కెట్ పనితీరుకు అనుగుణంగా స్థిరమైన రాబడిని అందించే అవకాశం ఉంది.
SWP ఎలా పని చేస్తుంది?
సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్‌లో... మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను, మీరు ఎంచుకున్న కాల వ్యవధి (నెలవారీ, అర్ధ వార్షిక లేదా వార్షిక) ప్రకారం ఫండ్ మేనేజర్ విక్రయిస్తాడు. ఉదాహరణకు, మీరు ప్రతి నెలా రూ. 10,000 విత్‌డ్రా చేయాలని నిర్ణయిస్తే, ఫండ్ మేనేజర్ ప్రతి నెలా రూ.10,000 సరిపోయే యూనిట్లను మార్కెట్‌లో అమ్మి, మీకు డబ్బు సమకూరుస్తాడు. లేదా, మీరు నిర్దిష్ట సంఖ్యలో యూనిట్లను అమ్మమని నిర్దేశిస్తే, ఆ యూనిట్లను అమ్మి ఎంత డబ్బు వస్తే అంత డబ్బు (ఛార్జీలు మినహాయించుకుని) మీకు అందే ఏర్పాటు చేస్తాడు. మిగిలిన యూనిట్ల విలువ మార్కెట్ గమనంతో పాటు పెరుగుతూ, తగ్గతూ ఉంటుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్‌పై ఉండే చిప్‌లో కీలక సమాచారం, అందుకే అది చాలా ముఖ్యం