Chief Justice of India: తదుపరి సీజేఐగా సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యూయూ లలిత్‌ ) పేరును రికమండ్ చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ. జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఈ నెల 26 పదవీ విరమణ చేసిన మరుసటి రోజు (ఆగస్టు 27న) 49వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. 






కీలక కేసుల్లో


దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్‌ తలాక్‌ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ యూయూ లలిత్‌ భాగస్వామిగా ఉన్నారు. ఆయన సీజేఐ అయితే బార్‌ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తి అవుతారు. 1971 జనవరిలో 13వ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రీ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన మొదటి న్యాయవాది. 1964లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


ప్రొఫైల్



  • 1957 నవంబరు 9న జన్మించారు జస్టిస్ యూయూ లలిత్.

  • 1983 జూన్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.

  • 1985 డిసెంబరు వరకు బొంబాయి హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు చేశారు.

  • 1986 జనవరి నుంచి తన ప్రాక్టీసును సుప్రీం కోర్టుకు మార్చారు.

  • 2014, ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


పని వేళలపై


సుప్రీం కోర్టు పనివేళలపై న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు రోజూ ఉదయం 7 గంటలకే బడికి వెళ్లగలిగినప్పుడు, కోర్టులు కూడా రోజూ ఉదయం 9 గంటలకు విధులను ఎందుకు ప్రారంభించలేవని ప్రశ్నించారు.


" కోర్టు కార్యకలాపాలు త్వరగా ప్రారంభమవాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. రోజూ ఉదయం 9 గంటలకు విచారణలు ప్రారంభించడం సరైన సమయం. మన పిల్లలు ఉదయం ఏడు గంటలకు బడికి వెళ్లగలుగుతున్నపుడు, మనం ఉదయం 9 గంటలకు కోర్టుకు ఎందుకు రాలేం? సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవ్వాలి. ఉదయం 11.30 గంటలకు అర గంట సేపు విరామం తీసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ ప్రారంభించాలి.  దీనివల్ల సాయంత్రం మరిన్ని ఎక్కువ పనులు చేయడానికి వీలవుతుంది.                                                       "
-జస్టిస్ యూయూ లలిత్, సుప్రీం న్యాయమూర్తి 


సుప్రీం సమయం


పని దినాల్లో ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. అనంతరం సాయంత్రం 4 గంటల వరకు కార్యకలాపాలు జరుగుతాయి.


Also Read: Rahul Gandhi Karnataka Mutt: రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు: స్వామీజీ జోస్యం


Also Read: Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 19 వేల మందికి వైరస్