Nagari Accident: చిత్తూరు జిల్లా నగరి మండలం ధర్మాపురం వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. వేగంగా వస్తున్న ఓ లారీ ధర్మాపురం వద్ద అదుపు తప్పింది. ఈక్రమంలోనే వ్యాను, కారు, బైకుతో పాటు జాతీయ రహదారిపై మార్కింగ్ వేస్తున్న నలుగురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి అక్కడికక్కడే చనిపోగా... మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరో చిన్నారితో పాటు ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రజల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్చి ఉంది.
ఇటీవలే బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురి మృతి
బాపట్ల జిల్లాలో సంతమాగులూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు - కర్నూలు ప్రధాన రహదారిపై సంతమాగులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఆటోను ఓ లారీ వేగంగా ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. సంతమాగులూరు వద్ద 7 మందితో వెళ్తున్న ఆటోను నరసరావుపేట నుంచి వినుకొండ రోడ్డు వైపు వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గుంటూరు నల్లపాడుకు చెందిన కేటరింగ్ వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఆటో మార్కాపురం వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుపతిలో తప్పతాగి కారుతో బీభత్సం..
తిరుపతి జిల్లా (ఉమ్మడి నెల్లూరు జిల్లా) గూడూరు పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం సేవించిన యువకులు రోడ్డుపై వాహనం నడుపుతూ హల్ చల్ చేశారు. అతివేగంగా, నిర్లక్ష్యంగా కారు నడపడంతో కొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా, దాదాపు 10 మందికి గాయపడ్డారు. గూడూరు స్టోర్స్ సూపర్ మార్కెట్ వద్ద బుధవారం ఈ ఘటన జరిగింది. గూడూరు పట్టణంలో కొందరు యువకులు కారు (AP 39 ME 2986)లో వెళ్తున్నారు. అప్పటికే మద్యం సేవించి ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. స్టోర్స్ సూపర్ మార్కెట్ వద్దకు రాగానే అతివేగంగా కారు నడపడంతో కొన్ని బైకులు నుజ్జునుజ్జు అయ్యాయి. కొన్ని బైకులను ఢీకొట్టిన తరువాత సైతం కారు కంట్రోల్ చేయకపోవడంతో మరికొందరు వాహనదారులను ఢీకొట్టారు. ఈ క్రమంలో కారు స్టోర్స్ ఎదుట నిలిచిపోయింది. దాదాపు 10 మంది వరకు గాయపడగా, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కొందరికి కాళ్లు, చేతులు విరిగాయని స్థానికులు తెలిపారు.