Chinese Spy Balloons in India:
జపాన్, భారత్‌పైనా..
అమెరికా ఎయిర్‌బేస్‌లో చైనా స్పై బెలూన్ చక్కర్లు కొట్టడం సంచలనమైంది. దాదాపు రెండు రోజుల పాటు దానిపై నిఘా పెట్టిన అగ్రరాజ్యం.. చివరకు ఫైటర్ జెట్‌తో పేల్చి వేసింది. అయితే...ఈ స్పై బెలూన్ వివాదం ఇక్కడితో ముగిసేలా లేదు. అమెరికానే కాకుండా
మరి కొన్ని దేశాలనూ చైనా టార్గెట్ చేసినట్టు ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో భారత్‌తో పాటు జపాన్ కూడా ఉంది. ఇప్పటికే ఈ బెలూన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా భారత్‌కు తెలిపింది. వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా డిప్యుటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండీ శెర్మన్ ఈ విషయమై మాట్లాడారు.
"చైనా స్పై బెలూన్ చాలా రోజులుగా యాక్టివ్‌గా ఉంటోంది. మిలిటరీ పరంగా బలంగా ఉన్న దేశాల సమాచారాన్ని సేకరిస్తోంది. జపాన్, భారత్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్‌పై నిఘా పెట్టింది"
-వాషింగ్టన్ పోస్ట్
నాలుగు చోట్ల..
స్వయంగా కొందరు మిలిటరీ అధికారులే ఈ విషయాలు వెల్లడించారు. దాదాపు 5 ఖండాల్లోని గగనతలంలో ఈ స్పై బెలూన్‌లు చక్కర్లు కొట్టినట్టు వివరించారు. కీలక ఆపరేషన్లపైనా నిఘా పెడుతోందని దేశాల సమైక్యతను ఇది దెబ్బ తీస్తోందని చెప్పారు. ఈ మధ్య కాలంలో హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువాం ప్రాంతాల్లోని ఎయిర్‌బేస్‌లలో ఇలాంటి స్పై బెలూన్‌లు కనిపించాయని తెలిపారు. ట్రంప్ హయాంలోనే మూడు సార్లు ఇలాంటి బెలూన్‌లు కనిపించాయి.
కొద్ది రోజులుగా అమెరికా ఎయిర్ బేస్‌లో చక్కర్లు కొడుతున్న చైనా స్పై బెలూన్‌ను షూట్ చేసేసింది అగ్రరాజ్యం. దాదాపు మూడు బస్సుల సైజ్ ఉన్న ఈ భారీ బెలూన్‌ను Fighter Jet F-22 షూట్ చేసింది. సింగిల్ మిజైల్‌తో ఆ బెలూన్ పేలిపోయింది. రక్షణ పరంగా సున్నితమైన ప్రాంతాలను, వ్యూహాత్మక ప్రదేశాలపై నిఘా పెడుతున్న చైనా స్పై బెలూన్‌ను కాల్చేసినట్టు అధికారులు వెల్లడించారు. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. బెలూన్‌ను పేల్చివేయడంపై తీవ్ర అసహనంతో ఉంది. అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. చైనా స్పై బెలూన్ కొద్ది రోజులుగా కలకలం సృష్టిస్తోంది. అలెర్ట్ అయిన అగ్రరాజ్యం... సెన్సిటివ్ ఎయిర్ బేస్‌లు, స్ట్రాటెజిక్ మిజైల్స్ ఉన్న చోటే ఈ బెలూన్ ఎగురుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ స్పై బెలూన్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసింది అమెరికా. మిలిటరీలోని ఉన్నతాధికారులు ఈ బెలూన్‌ను కాల్చేయాలని ముందే భావించారు. అధ్యక్షుడు బైడెన్ కూడా ఇందుకు ఓకే అన్నారు. కానీ...ఇలా చేయడం వల్ల కింద ఉన్న వాళ్లకు ప్రమాదం తలెత్తే అవకాశముందని ఆలోచనలో పడ్డారు అధికారులు. చివరకు ఆ బెలూన్‌ను పేల్చేశారు. కేవలం తమపై నిఘా ఉంచేందుకే చైనా ఇలా స్పై బెలూన్ పంపిందని అమెరికా ఆరోపిస్తోంది.
"విజయవంతంగా ఆ స్పై బెలూన్‌ను పేల్చివేశాం. ఈ పని ఇంత సక్సెస్‌ఫుల్‌గా చేసిన ఫైటర్ జెట్ పైలట్‌లకు నా అభినందనలు"
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు