ఏపీలో ఈ నెల 11 నుంచి ఇంటింటికీ జగన్ స్టిక్కర్ల కార్యక్రమం మొదలు పెట్టనుంది వైసీపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ ప్రభుత్వాలను ఏదో ఒక రకంగా అందుకునే ప్రతీ ఇంటికీ సీఎం జగన్ ఫోటో ముద్రించి ఉన్న స్టిక్కర్లను అంటించనున్నారు. జగన్ ఫోటోతోపాటు " మా నమ్మకం నువ్వే జగన్ " అనే స్లోగన్‌ను కూడా ఈ స్టిక్కర్ల లో ఉంటుంది . ఈ స్టిక్కర్ల అంటించే కార్యక్రమానికి గ్రామ వాలంటీర్లు, గృహ సారథులను వాడుకోనుంది ప్రభుత్వం. అయితే ఇంటి యజమాని అంగీకరించిన తరువాత మాత్రమే ఈ స్టిక్కర్‌ను అంటిస్తారని వైసీపీ చెబుతోంది. దీని ద్వారా సంక్షేమ పథకాల అమలుపై మరింత స్పష్టమైన వివరాలు ప్రభుత్వానికి లభిస్తాయని అధికార పార్టీ వర్గాలు చెబతున్నాయి.






ఓటర్ల నాడి పట్టేందుకు మాత్రమే అంటున్న విపక్షాలు


అయితే, ఈ కార్యక్రమం కేవలం ఓటర్ల నాడి పట్టేందుకు మాత్రమే అంటున్నాయి విపక్షాలు. స్టిక్కర్ల అంటించడం ద్వారా ఎంత మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అనేది తెలుసుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుంది అని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.


త్వరలోనే " జగనన్న కు చెబుదాం"


జగనన్న స్టిక్కర్లతోపాటు త్వరలోనే ప్రభుత్వం " జగనన్నకు చెబుదాం" అనే క్రొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వైసీపీ చెబుతోంది. దీని ద్వారా ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల ఫీడ్ బ్యాక్‌లను ప్రజల నుంచి డైరెక్ట్‌గా సీఎం జగన్ తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం విధి విధానాలు కూడా మరో రెండు మూడు రోజుల్లో ఫైనల్ చెయ్యనున్నారు. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న టైంలో మరిన్ని కార్యక్రమాలను డిజైన్ చేయనుంది ఏపీ సర్కార్ అని సమాచారం .


అప్పట్లో రావాలి జగన్ కావాలి జగన్ 


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నమే చేసి వైసీపీ విజయవంతమైంది. రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. ఇలాంటి స్టిక్కర్లను చేసి ఇంటింటికీ ప్రచారం చేసింది. అదే థీమ్‌తో పాటలు కూడా రికార్డు చేసింది. దీనిపై మీమ్స్, షార్ట్స్‌ చేసి ఆకట్టుకుంది. 


ఇప్పుడు అదే స్టైల్‌లో మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ స్లోగన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 2019 రావాలి జగన్ కావాలి జగన్... 2024 మా నమ్మకం నువ్వే జగన్ అంటూ అభిమానులు షేర్ చేస్తున్నారు. 


 






దీనిపై విపక్షాల నుంచి ట్రోల్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అసలు ఈ స్టిక్కర్ల ఖర్చు ఎవరిది... కాంట్రాక్ట్ ఎవరూ అంటూ జనసేన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కొందరు సామాన్యులు కూడా దీనిపై విమర్సలు చేస్తున్నారు.