సివిలైజ్డ్‌ స్టేటస్ పోగొట్టుకున్న నగరం..


ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే ఆకతాయిలు అల్లరి పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 
కొన్ని దేశాల్లో ఇలాంటి దుండగులకు నామమాత్రపు శిక్ష వేసి వదిలేస్తాయి. మరికొన్ని దేశాల్లో ఊహించని స్థాయిలో శిక్ష విధించి అలాంటిఘటనలు మళ్లీ  జరగకుండా చూసుకుంటాయి. అయితే చైనా మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నం. ఓ మహిళను ఇబ్బంది పెట్టారన్న కారణంగా ఏకంగా ఆ సిటీకి "సివిలైజ్డ్" స్టేటస్‌నే తొలగించేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ  న్యూస్‌ వైరల్‌ అయింది. అసలు విషయం ఏంటంటే చైనాలోని తంగ్‌షన్ సిటీలో ఓ రెస్టారెంట్‌కి నలుగురు మహిళలు వెళ్లారు. తినటం పూర్తయ్యాక రెస్టారెంట్ బయటకు వచ్చారు.అప్పుడే కొంత మంది ఆకతాయిలు వాళ్లను చుట్టుముట్టారు. తీవ్రంగా కొడుతూ కింద పడేసి లాగారు. జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చారు. మరికొందరు వీరితో చేయి కలిపి మహిళలందరిపరైనా ఇదే విధంగా దాడి చేశారు. జూన్ 10న ఈ సంఘటన జరగ్గా..ఈ ఉదంతం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతానికి ఇద్దరు మహిళలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.  


కఠినంగా శిక్షించాలంటూ ప్రజల డిమాండ్ 


ఇంత విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు బయటకురావటం వల్ల ఒక్కసారిగాచైనా వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. మహిళలకు భద్రత లేదంటూ అందరూ నినదించారు. సోషల్ మీడియాలోనూ హ్యాష్‌ట్యాగ్‌లు పెడుతూ పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక, ప్రజల్లో ఆగ్రహం రెట్టింపైంది. ఈ దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇదంతా గమనించిన ప్రభుత్వం వెంటనే స్పందించింది. సెంట్రల్ కమ్యూనిటీ పార్టీ కమిటీకి చెందిన సివిలైజేషన్ ఆఫీస్‌ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. వెంటనే తంగ్‌షన్ సిటీకి సివిలైజ్డ్ హోదా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. 


నేషనల్ సివిలైజ్డ్‌ సిటీస్‌ వెబ్‌ సైట్ ప్రకారం...ఓ నగరం సివిలైజ్డ్‌ హోదా పొందాలంటే 8 అంశాల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. సామాజికభద్రత అనేది ఇందులో అత్యంత కీలకమైన విషయం. ఈ అంశంలో తంగ్‌షన్‌ లోబడిలేదన్న కారణంగా నాగరికత లేని నగరంగాప్రకటించారు. 2011 నుంచి దాదాపు నాలుగు సార్లు సివిలైజ్డ్‌ హోదా సాధించింది ఈ నగరం. కానీ ఇప్పుడు జరిగిన ఘటనతో ఆ హోదా, గౌరవం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని ఇప్పటికే ప్రభుత్వం అక్కడి పోలీసులను ఆదేశించింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని హెచ్చరించింది.