Inhalable COVID-19 Vaccine: కరోనా వ్యాక్సినేషన్‌లో చైనా మరో ముందడుగు వేసింది. సూది అవసరం లేకుండా నోటి ద్వారా తీసుకునే కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీని చైనా మొదలు పెట్టింది. షాంఘై నగరంలో పంపిణీ చేస్తోన్న ఈ తరహా వ్యాక్సిన్ ప్రపంచంలోనే మొదటిగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్‌లకు కేవలం ఇంజక్షన్ ద్వారానే తీసుకునే వీలుంది.
ఇలా తీసుకోవాలి
ఈ వ్యాక్సిన్‌లోని ద్రవాన్ని నోటితో పీల్చాల్సి ఉంటుంది. ఐదు సెకన్ల పాటు ఊపిరి తీసుకోవాలి. ప్రక్రియ మొత్తం 20 సెకన్లలోనే ముగుస్తుంది. ప్రస్తుతం దీనిని బూస్టర్ డోసుగా పంపిణీ చేస్తున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు. చైనా బయోఫార్మా సంస్థ కాన్‌సినో బయోలాజిక్స్ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. వీటి ప్రయోగాలను చైనా, హంగేరీ, పాకిస్థాన్, మలేసియా, అర్జెంటీనాతోపాటు మెక్సికో దేశాల్లో పూర్తి చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
కఠిన చర్యలు
చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే వుహాన్ నగరంలో పాక్షిక లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. తాజాగా కరోనా రోగులపై అమానుషంగా ప్రవర్తిస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా సోకిన వారిని తరలించేందుకు చైనాలో క్రేన్ వినియోగిస్తున్నారు.
కొవిడ్ పేషెంట్‌ను క్రేన్‌కు కట్టి కంటైనర్‌లోకి చేర్చుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనా అధికారులు ఒక కొవిడ్ పాజిటివ్ రోగిని క్రేన్ సహాయంతో పైకి ఎత్తి సమీపంలో ఉన్న కంటైనర్ గదికి తరలిస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. భౌతిక దూరం పాటించడం కోసం మరీ ఇంతలా చేయాలా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.
చైనాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియో ఏ నగరానికి చెందినదో తెలియలేదు. చైనాలో వరుసగా మూడో రోజు కూడా 1,000 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా మరిన్ని ఆంక్షలను విధించింది. ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు చైనా అధికారులు చాలా శ్రమిస్తున్నారు. మరోవైపు చైనా తీసుకుంటున్న కఠిన చర్యలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయి. జీరో కొవిడ్ పాలసీ పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు చైనా గురిచేస్తోంది.
Also Read: 76th Infantry Day: 'పీఓకేను హస్తగతం చేసుకుంటాం'- పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్