China-Honduras Diplomatic Ties: 


దగ్గరైన చైనా,హోండూరస్‌


చైనా, హోండూరస్‌ మధ్య దౌత్య సంబంధాలు మొదలయ్యాయి. ఈ మేరకు చైనా అధికారిక ప్రకటన చేసింది. దాదాపు పదేళ్లుగా తైవాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగిస్తున్న హోండూరస్ ఉన్నట్టుండి తెగదెంపులు చేసుకుంది. చైనాకు దగ్గరైంది. ఈ ప్రపంచంలో ఒకే ఒక చైనా ఉందని,ఆ దేశాన్ని మాత్రమే తాము గుర్తిస్తామని కీలక వ్యాఖ్యలు చేసింది. పరోక్షంగా తైవాన్‌కు చురకలు అంటించింది. ఏడాది కాలంగా చైనా, తైవాన్ మధ్య ఘర్షణ కొనసాగుతోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) మిలిటరీ డ్రిల్స్ కూడా నిర్వహించింది. తైవాన్‌లోని పలు చోట్ల క్షిపణుల దాడులూ చేసింది. ఈ ద్వీప దేశాన్ని ఆక్రమించుకునేందుకు డ్రాగన్ అన్ని ప్రయత్నాలూ చేస్తూనే ఉంది. ఈ సమయంలోనే హోండూరస్ దేశం తైవాన్‌తో తెగదెంపులు చేసుకోవడం సంచలనమైంది. దౌత్య ఒప్పందం కుదిరిన తరవాత చైనా, హాండూరస్‌ అధికారిక ప్రకటన చేశాయి. 


"ప్రపంచంలో ఒకే ఒక చైనా ఉంది. దాన్ని మాత్రమే మేం గుర్తిస్తున్నాం. తైవాన్ చైనాలో భాగమే. చైనా నుంచి ఆ దేశాన్ని వేరు చేసి చూడలేం. ఇప్పటికే మేం ఆ దేశానికి సమాచారం అందించాం. ఇకపై తైవాన్‌తో మాకు ఎలాంటి దౌత్య సంబంధాలు ఉండవు" 


- హోండూరస్ విదేశాంగ శాఖ


"వన్ చైనా అనే నినాదానికి, విధానానికి కట్టుబడి ఉన్న 181 దేశాల జాబితాలో హోండూరస్ కూడా చేరిపోయింది. తైవాన్‌తో ఉన్న దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకుంది"


- చైనా విదేశాంగ శాఖ


భిన్న వాదనలు..


చైనా, తైవాన్ మధ్య ఎన్నో ఏళ్లుగా ఘర్షణ కొనసాగుతోంది. ఇటీవల అమెరికా జోక్యంతో ఇది కాస్తా ముదిరింది. తైవాన్‌ గురించి చైనా చేస్తున్న వాదన ఒకటే. తైవాన్..తమ భూభాగం నుంచి విడిపోయిన ఓ ప్రావిన్స్‌ అని చెబుతోంది డ్రాగన్ దేశం. అంటే..పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC)లో భాగమే అని అంటోంది. కానీ..తైవాన్ మాత్రం ఈ వాదనను ఎప్పటి నుంచో కొట్టి పారేస్తోంది. తమను తాము ప్రత్యేక దేశంగా చెప్పుకుంటోంది తైవాన్. అయితే ఇప్పటికీ ఈ దేశాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనాగానే వ్యవహరిస్తున్నారు. 1927లో చైనాలో అంతర్యుద్ధం మొదలైంది. నేషనలిస్ట్‌, కమ్యూనిస్ట్‌ల మధ్య ఈ యుద్ధం జరిగింది. అయితే...ఇంతలో రెండో ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చింది. చైనాను ఆక్రమించాలని చూసిన జపాన్‌ను అడ్డుకోవటంలో మునిగిపోయింది డ్రాగన్ ప్రభుత్వం. ఆ సమయంలో అంతర్యుద్ధానికి తెర పడింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయాక, మరోసారి అంతర్యుద్ధం మొదలైంది. 


మాదీ ప్రజాస్వామ్య దేశమే అంటున్న తైవాన్..


1949లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ CCP,పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ఏర్పాటు చేసి, బీజింగ్‌ను రాజధానిగా ప్రకటించారు. అయితే నేషనలిస్ట్‌లు అంతా ఉన్నట్టుండి తైవాన్‌కు వెళ్లిపోయారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజధానిని తైపెయ్‌గా ప్రకటించుకున్నారు. వారితో పాటు దాదాపు 12 లక్షల మంది దీనికి ఆమోదం తెలిపారు. అప్పటి నుంచి ఆస్ట్రేలియా..దాదాపు రెండు దశాబ్దాల వరకూ చైనా రాజధానిని తైపెయ్‌గానే గుర్తించింది. 1971లో యునైటెడ్ నేషన్స్ బీజింగ్‌ను చైనా రాజధానిగా గుర్తిస్తూ ఓ తీర్మానం పాస్ అయింది. అప్పుడే ప్రపంచమంతా చైనా రాజధానిగా బీజింగ్‌ను గుర్తించాల్సి వచ్చింది. తైవాన్ మాత్రం..రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజ్యాంగ ప్రకారం తమదీ ఓ దేశమేనని వాదిస్తున్నాయి. నియంతృత్వ పాలన నుంచి బయటపడి ప్రజాస్వామ్య దేశంగా మారామని ప్రకటించుకుంది.