China Covid Battle: జీరో కొవిడ్ పాలసీతో పాటు కఠిన ఆంక్షలు ఎత్తేసినప్పటి నుంచి చైనాలో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. బీజింగ్ సహా పలు ముఖ్యమైన నగరాల్లోని ఆసుపత్రులన్నీ చాలా బిజీగా ఉన్నాయి.
ఒకేసారి ఆంక్షలను సడలించడంతో దేశంలో కొవిడ్ నియంత్రణ లేకుండా వ్యాప్తి చెందుతుందని, రోజుకు మిలియన్ల మంది ప్రజలకు కరోనా సోకుతుందని కొంతమంది అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు తెలిపారు. నైరుతి చైనీస్ నగరమైన చెంగ్డులో హుయాక్సి హాస్పిటల్ సిబ్బంది.. రోగులతో బిజీబిజీగా ఉన్నారు. డిసెంబర్ 7 నుంచి చైనాలో ఆంక్షలు సడలించడంతో ఆసుపత్రి రద్దీగా మారిందని వారు తెలిపారు.
"నేను 30 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నాను. కానీ ఆసుపత్రి ఇంత రద్దీగా ఉండటం ఎప్పడూ చూడలేదు." అని ఆసుపత్రి వెలుపల ఉన్న ఒక అంబులెన్స్ డ్రైవర్ తెలిపాడు. మంగళవారం సాయంత్రం ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, పక్కనే ఉన్న ఫీవర్ క్లినిక్ బయట కిలో మీటర్ల మేర క్యూలైన్లు ఉన్నాయి.
శ్మశానాల వద్ద క్యూ
చైనాలో కరోనా మరణమృదంగం వాయిస్తోంది. నిత్యం వేల మంది కొవిడ్ కారణంగా చైనాలో ప్రాణాలు కోల్పోతున్నారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ చైనా మాత్రం గత వారం రోజుల్లో కేవలం ఒకే ఒక్క మరణం నమోదైందని చెబుతోంది. కానీ ఇది అబద్ధమని తెలుస్తోంది. ఎందుకంటే చైనాలో శ్మశానాల వద్ద భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మృతదేహాలతో కుటుంబీకులు బారులు తీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలో కొవిడ్ మరణాల పరిస్థితిని తెలియజేస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగల్ డింగ్ షేర్ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఒమిక్రాన్
చైనాలో కరోనా నిబంధనలను ఎత్తేసిన తర్వాత పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. పెరుగుతున్న కేసులతో చైనాలోని ఆసుపత్రులు కిటకిటలడుతున్నాయి. వచ్చే 90 రోజుల్లో చైనాలోని 60 శాతానికి పైగా ప్రజలకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫెఇగ్ల్ -డింగ్ అంచనా వేశారు.
చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉందని.. అంటే వ్యాధి సోకిన వ్యక్తి నుంచి 16 మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు.