China COVID -19 Deaths:
అమెరికా సంస్థ అంచనాలు
చైనాలో ఇప్పుడిప్పుడే కరోనా ఆంక్షల్ని సడలిస్తోంది జిన్‌పింగ్ ప్రభుత్వం. జీరోకొవిడ్ పాలసీపై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగిన నేపథ్యంలో... వాటిని సరళతరం చేస్తోంది. అయితే...ఈ ఆంక్షల్ని ఎత్తివేయడం వల్ల చైనాలో భారీ సంఖ్యలో మరణాలు నమోదయ్యే ప్రమాదముందని అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME) అంచనా వేసింది. వచ్చే ఏడాదిలో అనూహ్య స్థాయిలో కేసులు నమోదవడమే కాకుండా...లక్షలాది మరణాలు సంభవించే అవకాశముందని హెచ్చరించింది. 2023 ఏప్రిల్ 1వ తేదీ నాటికి చైనా వ్యాప్తంగా కొవిడ్ కేసులు తారస్థాయికి చేరుకుంటాయని, మరణాల సంఖ్య 3 లక్షల 22 వేల వరకూ నమోదవుతుందని అంచనా వేసింది. అప్పటికి ఆ దేశ జనాభాలో మూడోవంతు ప్రజలకు కొవిడ్ సోకుతుందని తెలిపింది. నిజానికి...చైనాలో ఇప్పటికే కొవిడ్ మరణాలు పెరిగాయని.. కానీ ప్రభుత్వం ఆ లెక్కల్ని బయటపెట్టడం లేదనిఆరోపణలున్నాయి. చివరి సారి డిసెంబర్ 3వ తేదీన మరణాల సంఖ్యను వెల్లడించింది చైనా. అప్పటి నుంచి మరే వివరాలూ అందలేదు. ఈ నెల మొదట్లోనే ఆంక్షల్ని సడలించింది ప్రభుత్వం. అప్పటి నుంచి కొవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. వచ్చే నెల నాటికి దేశ జనాభా అంతటికీ వైరస్ సోకుతుందని ఆందోళన చెందుతున్నారు. అమెరికాకు చెందిన IHME..జీరోకొవిడ్ పాలసీ వల్లే చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా సోకకుండా అడ్డుకోగలిగారని తేల్చి చెప్పింది.
వెనక్కి తగ్గిన చైనా..
చైనా ప్రభుత్వానికి జీరో కొవిడ్ పాలసీ పెద్ద తలనొప్పే తెచ్చి పెట్టింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చాలా రోజులుగా అక్కడ ఏదో ఓ నగరంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకీ చైనా పౌరులకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. జిన్‌పింగ్ ప్రభుత్వంపై అసహనమూ ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే...చైనా కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా కఠిన ఆంక్షల్ని పక్కన పెట్టేసి క్రమంగా వాటికి మినహాయింపులు ఇచ్చే పనిలో పడింది. "ఆంక్షలను సరళతరం చేస్తున్నాం" అని ప్రకటించింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ చేసిన ప్రకటన ఆధారంగా చూస్తే...PCR టెస్టింగ్ విషయంలో ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలకు కాస్త మినహాయింపులు ఇవ్వనున్నారు. లాక్‌డౌన్ లను కూడా క్రమంగా తొలగించనున్నారు. సివియర్ సింప్టమ్స్ లేని బాధితులు ఇంట్లోనే ఐసోలేట్ అయ్యేందుకు అవకాశం కల్పించ నున్నారు. పబ్లిక్ బిల్డింగ్స్‌లోకి వెళ్లాలంటే ఇప్పటి వరకూ చైనా పౌరులు తమ ఫోన్‌లో గ్రీన్ కోడ్‌ను అధికారులకు చూపించాల్సి వచ్చేది.
ఇప్పుడా అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే...నర్సింగ్ హోమ్స్, వైద్య సంస్థలు, పాఠశాలల్లో మాత్రం ఈ నిబంధన కొనసాగనుంది. లక్షణాలు లేని, స్వల్పంగా ఉన్న బాధితులను బలవంతంగా క్వారంటైన్‌లోకి తీసుకెళ్లడమూ ఇకపై ఉండదని వెల్లడించింది.
లక్షణాలు లేని బాధితులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండొచ్చు. లేదంటే ప్రభుత్వం కల్పించిన క్వారంటైన్ సౌకర్యాన్నైనా వినియోగించు కోవచ్చు" అని ప్రభుత్వం తెలిపింది.