BJP On Rahul Gandhi:


సైన్యాన్ని కించపరిచారంటూ ఆగ్రహం..


తవాంగ్ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ..కీలక వ్యాఖ్యలు చేశారు. "చైనా భారత్‌తో యుద్ధం కోరుకుంటోంది. కానీ కేంద్రం మాత్రం నిజాలు దాచి పెడుతోంది" అంటూ మోడీ సర్కార్‌పై విమర్శలు చేశారు. దీనికి బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీ ప్రతినిధి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ దీనిపై స్పందించారు. "ఇది నెహ్రూ కాలం నాటి ఇండియా కాదు. చైనా మన దేశ  భూభాగంలో 37,242 చదరపు కిలోమీటర్ల మేర చొచ్చుకు వచ్చి ఆక్రమించినా అప్పుడు చలించలేదు. అప్పుడు ప్రభుత్వం గాఢ నిద్రలో ఉంది" అని విమర్శించారు. భారత సైన్యాన్ని కించపరిచారంటూ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే మోడీ సర్కార్ నిద్రపోతోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ఇలా బదులిచ్చారు. "భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ భారత సరిహద్దు ప్రాంతాల్లోని భద్రత గురించి చాలా మాట్లాడారు. దేశ పౌరుల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత సైన్యాన్నీ కించ పరుస్తున్నారు. నెహ్రూ కాలం నాంటి ఇండియా కాదిది" అని ఘాటుగా స్పందించారు. దేశ భద్రతపై అలాంటి బాధ్యతరాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. "భారత భూభాగాన్ని చైనా పరమయ్యేలా నిర్లక్ష్యం వహించిన నెహ్రూ మనవడు...ఇప్పుడు చైనాతో చాలా క్లోజ్‌గా ఉంటున్నాడు. ఎంతలా అంటే...ఆ దేశం ఎప్పుడు ఏం చేస్తుందో కూడా ఆయనకు తెలిసిపోయేంతలా" అని మండి పడ్డారు రాజ్యవర్దన్ సింగ్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాతో కాంగ్రెస్ ప్రభుత్వం పలు ఒప్పందాలనూ కుదుర్చుకుందని ఆరోపించారు. దేశంలో యూపీఏ పాలనలోనే చైనా దుశ్చర్యలకు పాల్పడిందని తేల్చి చెప్పారు.     


అరుణాచల్ సీఎం వ్యాఖ్యలు..


భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా స్పందించారు. ఇది 1962 యుగం కాదని, 2022లో ప్రధాని మోదీ యుగం అని అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం ఖండూ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా పట్ల నెహ్రూ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఆయన తప్పుబట్టారు. తవాంగ్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితికి మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కారణమని ఖండూ ఆరోపించారు. సిమ్లా ఒప్పందం తర్వాత తవాంగ్‌ను భారత భూభాగంగా మార్చారని అన్నారు. డిసెంబర్ 9న అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ జరిగింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిన.. చైనా జవాన్లను మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి. ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం.


Also Read: Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం, బాధితురాలి పిటిషన్‌లు కొట్టివేత