China Corona Deaths:
కొత్త నిబంధన..
చైనాలో కొవిడ్ విజృంభణ మళ్లీ మొదలైంది. ఎప్పటిలాగే అక్కడి ప్రభుత్వం లెక్కలు దాచి పెడుతోంది. ఎంత మందికి కరోనా సోకుతోంది..? ఎంత మంది చనిపోతున్నారు..? అనే వివరాలు సరిగా వెల్లడించడం లేదు. ఈ విషయంలో ఎప్పటి నుంచో చైనాపై ప్రపంచవ్యాప్తంగా అసహనం వ్యక్తమవుతూనే ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే...జిన్‌పింగ్ ప్రభుత్వం ఇప్పుడు "మరణానికి నిర్వచనం"మార్చేసింది. ఈ నిబంధన ప్రకారం..ఎవరైనా శ్వాస సంబంధింత సమస్యలతో మరణిస్తేనే వారిని "కొవిడ్ మృతుల" జాబితాలో చేర్చుతారు. కరోనా కారణంగా మిగతా ఎలాంటి ఇబ్బంది కలిగి చనిపోయినా...వాటిని కరోనా మరణాలుగా పరిగణించరు. ఇప్పటికే చైనాపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతుండగా...ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది ఆ ప్రభుత్వం. ఇక అక్కడి ఆసుపత్రులు కరోనా బాధితులతో కిటకిటలా డిపోతున్నాయి. అక్కడి అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం..డిసెంబర్ 20న కేవలం ఇద్దరు మాత్రమే కొవిడ్ కారణంగా చనిపోయారు. అంతకు ముందు రోజు కూడా ఇద్దరే మరణించారని లెక్కలె చెప్పారు. అయితే..సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మాత్రం శ్మశానాల వద్ద భారీ సంఖ్యలో శవాలను పేర్చి పెట్టారని వార్త రాసింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, అక్కడి పరిస్థితులు ఏ పొంతనా కుదరడం లేదు. ట్విటర్‌లో అక్కడి పరిస్థితులకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. చైనీస్ బ్లాగర్ ఒకరు ఈ వీడియోలు పోస్ట్ చేశారు. కొన్ని ఆసుపత్రుల్లోని మార్చురీల్లో కుప్పలుగా శవాలు పడి ఉన్నాయి. మరో వీడియోలో ఓ వ్యక్తి కరోనా సోకి తీవ్ర లక్షణాలతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యం కోసం చూసి చూసి ఓపిక లేక కిందపడిపోయాడు. ఆ బాధితుడికి చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో లేదు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భయపడాల్సిన పని లేదు..
చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ప్రభావం మిగతా దేశాలపైనా పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది. కేంద్రఆరోగ్య మంత్రి నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అయినా...భారత్ ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. "భారత్‌లో వ్యాక్సినేషన్ కవరేజ్ రికార్డు స్థాయిలో ఉంది. భయపడాల్సిన పని లేదు" అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ప్రజలకు సూచించారు. "చైనాలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న వార్తలు కాస్త ఆందోళన కలిగిస్తున్న మాట నిజమే. కానీ...మన దేశంలో వ్యాక్సినేషన్ కవరేజ్ చాలా బాగుంది. అందుకే భయపడాల్సిన పని లేదు. భారత ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంచాలి. జాగ్రత్తలూ పాటించాలి" అని ట్వీట్ చేశారు అదర్ పూనావాలా.
Also Read: Viral Video: నేను మీ సర్వెంట్‌ను కాదు, ప్రయాణికుడిపై ఎయిర్‌హోస్టెస్ అసహనం - వైరల్ వీడియో