సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కింద అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్ బీఎస్సీ కోర్సు ఫీజులను ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఖరారు చేసింది. బీఎస్సీ కోర్సులో చేరాలంటే ఇకపై మొదటి సంవత్సరం రూ.11 లక్షల ఫీజు చెల్లించాలని నిర్ణయించింది. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మిగిలిన మూడేళ్లు ఏటా రూ.లక్ష చొప్పున చెల్లించాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. అలాగే హార్టికల్చర్ బీఎస్సీ కోర్సుకైతే మొదటి ఏడాది రూ.6 లక్షలు, మిగిలిన మూడేళ్లపాటు ఏటా రూ.లక్ష చొప్పున చెల్లించాలని తెలిపింది.


ఈ కోర్సులకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఎంసెట్ ర్యాంకర్లు డిసెంబర్ 28, 29 తేదీల్లో వర్సిటీలో జరిగే ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించింది. ఈడబ్ల్యుఎస్ కేటగిరీకి చెందిన విద్యార్థులు తప్ప.. మిగిలినవారంతా ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని స్పష్టంచేసింది. ఎంసెట్‌లో పొందిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఏజీ బీఎస్సీ కోర్సులో 154, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌లో 10, హార్టీకల్చర్ బీఎస్సీలో 40 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లన్నీ జయశంకర్ వ్యవసాయ, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీల పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నందున వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రైవేటు కాలేజీల్లో ఈ కోర్సుల్లో చేరాలంటే ఇంతకన్నా ఎక్కువగా రుసుములు ఉన్నందున విద్యార్థులు వీటిలో చేరేందుకు ముందుకు వస్తున్నారని అధికారులు చెప్పారు.


వ్యవసాయ డిగ్రీ కాలేజీల్లో ఎన్నారై కోటా కింద మరో 10 సీట్లు ఉన్నాయి. ఈ సీటు పొందాలంటే రూ.34 లక్షల రుసుం చెల్లించాలి. ఇప్పటికి కేవలం నలుగురు మాత్రమే చేరారు. ఈ రుసుం ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ సీటు పొందాలంటే ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైతే చాలు. ఎంసెట్ రాయాల్సిన అవసరం లేదు. గతేడాది వరకూ ఈ సీట్లకు భారీగా పోటీ ఉండేది. కానీ రాష్ట్రంలోని ప్రైవేటు వర్సిటీలు వ్యవసాయ డిగ్రీ కోర్సులను ఇంతకన్నా తక్కువ రుసుములకే నిర్వహిస్తున్నందున విద్యార్థులు వీటికోసం పోటీపడడం లేదని అంచనా. తాజాగా బీసీ గురుకుల మహిళా కళాశాలల్లో సైతం వ్యవసాయ డిగ్రీ కోర్సులను ప్రారంభించారు.


రాష్ట్రంలో రెండేళ్ల క్రితం వరకూ ఏజీ బీఎస్సీ సీట్లకు విపరీతమైన పోటీ ఉండేది. ఈ కోర్సు పూర్తిచేస్తే అగ్రికల్చర్ ఆఫీసర్‌గా ఉద్యోగం వస్తుందనే ప్రచారం ఎక్కువగా ఉంది. అయితే వ్యవసాయశాఖలో పదవీ విరమణ చేసిన వారి పోస్టులు ఖాళీ అయితే తప్ప కొత్తగా పోస్టులు రావడం లేదని, కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసమే ఈ కోర్సులో చేరవద్దని వర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త ఒకరు విద్యార్థులను కోరారు. వ్యవసాయంపై అభిరుచి ఉన్నవారు లేదా వ్యవసాయ వాణిజ్యవేత్తగా స్థిరపడాలనుకునేవారికి ఈ కోర్సులు ఎంతో ఉపయోగకరమని ఆయన సూచించారు.


Also Read:


TS EAMCET 2023: జనవరిలో ఎంసెట్ నోటిఫికేషన్! ఈ సారికి 'ఇంటర్' వెయిటేజీ లేనట్లే?
తెలంగాణ ఎంసెట్ 2023 నోటిఫికేషన్ జనవరిలో విడుదలకానుంది. ఒకపక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలను వెల్లడించడం, మరోవైపు ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూలును ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ ఎంసెట్‌ నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. 2023 జనవరిలో పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికోసం మండలి అధికారులు త్వరలో సమావేశం కానున్నారు. 
తెలంగాణ ఎంసెట్ 2023 పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..