China Blank Page Revolution:


ప్రభుత్వానికి వ్యతిరేకంగా..


చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చాలా రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా కొవిడ్ ఆంక్షల విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. వీటిని కూడా ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఎక్కడ జనం గుమిగూడినా వెంటనే పోలీసులు దాడులు చేస్తున్నారు. అందుకే..పౌరులు కొత్త తరహాలో ఉద్యమిస్తున్నారు. ఎలాంటి నినాదాలు చేయకుండానే తమ వ్యతిరేకత తెలియజేస్తున్నారు. ఇదే "బ్లాంక్ పేజ్ ఉద్యమం" (Blank Page Revolution). అంటే...కేవలం ఓ తెల్ల కాగితం పట్టుకుని నిరనస వ్యక్తం చేయడం. తెల్లకాగితాలతో ఉద్యమం ఏంటి..? అనిపిస్తుండొచ్చు. కానీ..దీనికి ప్రత్యేక కారణముంది. ప్రభుత్వం ఏం చేసినా..సెన్సార్ పేరిట అణగదొక్కేస్తోంది. దీంతో విసిగిపోయిన ప్రజలు ఇలా A4 పేపర్లు పట్టుకుని నిలబడుతున్నారు. ఈ తెల్ల కాగితమే ప్రభుత్వానికి సెగ పుట్టిస్తోంది. పైగా...ఇలా వైట్‌ పేపర్స్‌తో నిరసనలు చేపడితే...పోలీసులు తమను అరెస్ట్ చేయలేరన్న ధీమాతో ఉన్నారు పౌరులు. ఎలాగో వాటిపై ఏమీ రాసి ఉండదు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలూ ఉండవు. అలాంటప్పుడు ఏ కారణం చూపించి తమను అరెస్ట్ చేస్తారు..? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీన్నే "White Paper Revolution","A4 Revolution"అని పిలుస్తున్నారు. ఈ ఉద్యమం చైనాకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచమంతా దీని గురించి మాట్లాడుకుంటోంది. పలు దేశాల పౌరులు చైనీస్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. చైనా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. 


సోషల్ మీడియాలో నిరసనలు..


సోషల్ మీడియా ప్లాటఫామ్స్‌ని ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటికీ...ఏదో లూప్‌హోల్ కనుగొని...అందులో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక పోస్ట్‌లు పెడుతున్నారు. చైనాలోని WeChat App ద్వారా ఆందోళనలు చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా సమాచారం అందించుకుంటూ..ఒక్కచోట గుమి గూడుతున్నారు. ప్రతి పోస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిరసనలు చేపట్టాల్సిన ఏరియాకు సంబంధించిన మ్యాప్‌ను యాడ్ చేస్తున్నారు. ఫలితంగా... అందరూ సులువుగా అక్కడికి చేరుకుంటున్నారు. అంతే కాదు. ప్రభుత్వ సెన్సార్ నుంచి తప్పించుకునేందుకు లొకేషన్‌కు సంబంధించిన కోడ్‌లను అందరికీ పంపుతున్నారు.


నిబంధనలు సరళం చేస్తారా..? 


చైనా కొవిడ్ నిబంధనలను సరళతరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని మినహాయింపులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిరక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది. National Health Commissionలో భాగంగా ప్రభుత్వ ప్రతినిధులు అదే సంకేతాలు కూడా ఇచ్చారు. "ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. వ్యాక్సినేషన్ రేటుని బాగా పెంచగలిగాం" 
అని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కొత్త వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు. అంటే...ఇప్పుడున్న ఆంక్షల స్థానంలో కొత్తవి రానున్నాయి. అయితే...అవి మరీ జీరో కొవిడ్ పాలసీలా కఠినంగా ఉండవని తెలుస్తోంది. పైగా...ఈ పాలసీతో చైనా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బ తింటోంది. ఇది దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆ విధానాన్ని పక్కన పెట్టే యోచనలో ఉంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ చేసేవాళ్లు, విద్యార్థులు, టీచర్లతోపాటు ఇంటి నుంచి పెద్దగా బయటకు రాని వాళ్లకు డెయిలీ టెస్ట్‌లు చేయడం తగ్గించాలని చూస్తోంది. అయితే...కేఫ్‌లు, రెస్టారెంట్‌లు, షాపింగ్ మాల్స్‌లోకి వెళ్లాలంటే మాత్రం కచ్చితంగా కొవిడ్ టెస్ట్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే. 


Also Read: US France United Front: ఉక్రెయిన్ కోసం ఒక్కటవుతున్న అమెరికా, ఫ్రాన్స్ - పుతిన్‌తో రాయబారం కోసమేనట